IMD Rain Alert To AP Districts: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఐఎండీ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి 980 కి.మీ, చెన్నైకి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. రాగల 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు - శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ జిల్లాల్లో వర్షాలు
వాయుగుండం ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకూ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 26 నుంచి 28 వరకూ దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని.. 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
మత్స్యకారులకు అలర్ట్
వాయుగుండం నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కోస్తాంధ్రలోని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు. అటు, దక్షిణ కోస్తాంధ్రలో రైతులు అప్రమత్తంగా ఉండాలని.. కోతల చేపట్టవద్దని, ఇప్పటికే కోతలు కోస్తే పంటలను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. తుపాను ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అన్నారు.