Heavy Rains In Ap And Telangana: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అటు, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హైదరాబాద్, సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది.


గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఏపీ తాజా వెదర్ రిపోర్ట్


మరోవైపు, అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ వచ్చే 3 రోజుల పాటు కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉపరితల గాలులు గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.


Also Read: CM Chandrababu: పౌర సేవలపై ప్రత్యేక ప్రాజెక్ట్ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు