Rains In Andhra Pradesh | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇదివరకే తీవ్ర వాయుగుండంగా మారింది. నేడు వాయుగుండం ఫెంగల్ తుపానుగా ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతా వరణం మారిపోయింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ బుధవారం తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారి తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27, 28, 29న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ
ఏపీలో 27న ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. అయితే నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
రాయలసీమలో శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నందున ఈ ప్రాంతాలకు కూడా ఐఎండీ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా నవంబర్ 28 నుంచి ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.
అన్నదాతలకు వాతావరణశాఖ సూచనలు
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా వరికోతలు ఆపాలని అన్నదాతలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వాతావరణ శాఖ ప్రకటన కంటిమీద కునుకులేకుండా చేస్తోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై చలిగాలుల తీవ్రత పెరగడంతో తుపాను ముప్పుతప్పేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో సుమారు 4.37 లక్షల ఎకరాలలోవరిసాగైంది. ధాన్యం కోనుగోలు ముమ్మరంగా చేసి ఉంటే మరింత మంది కోతకోసి ఉండేవారు. సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు లేక పోవడం వాతావరణం కలిసి రాకపోయిన తుఫాన్ ప్రభావం లేకపోవడంతో నానా హైరానా తో పెట్టుబడి అధికమైన వరిపంటను రైతులు పండించగలిగారు. ఇప్పటికే వరిపైరును కోసి ఇమ్ము చేసిన రైతులు నూర్పు చేసిన ధాన్యం బస్తాలలో ఎత్తి నిల్వ చేస్తున్నారు.
తెలంగాణపై ఫెంగల్ తుపాను ప్రభావం
ఫెంగల్ తుపాను తెలంగాణపై సైతం ప్రభావం చూపనుంది. ఒక్రటెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. నాలుగైదు రోజులపాటు విపరీతంగా చల్లగాలులు వీచనున్నాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం పొగమంచు అధికంగా కురవనుంది.
ప్రాంతాలు గరిష్టం కనిష్టం
ఆదిలాబాద్ 28.8 9.7
హైదరాబాద్ 28.4 14.8
ఖమ్మం 31.2 18.4
భద్రాచలం 29.6 18
దుండిగల్ 28.4 13.2
పటాన్‌చెరు 28.2 11.2
హయత్ నగర్ 28 15
నిజామాబాద్ 30.5 14.2
రామగుండం 28 15.4
మహబూబ్ నగర్ 29.4 18.2
మెదక్ 28.6 10.6
నల్గొండ 28.5 18