Rains In Telugu States: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాబోయే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. అలాగే, ఉత్తర ఒడిశా - పశ్చిమబెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 7.6 కి.మీల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం ఉందని చెప్పారు. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3 రోజులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, భీమవరం, గన్నవరం, అన్నవరం, కాకినాడ, అమలాపురం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, నెల్లూరు, నంద్యాల, అనకాపల్లి, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, తూ.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
తెలంగాణలో..
అటు, తెలంగాణలో సైతం కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also Read: Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిపుణుల టీమ్ - 4 రోజులపాటు పరిశీలన