Andhra Pradesh Weather Update | అమరావతి/ హైదరాబాద్: ఫెంగల్ తుపాను అనంతరం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణలో తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం నాడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం వచ్చే 12 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉంది. ఇది క్రమంగా పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక- తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతానికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉపరితల అవర్తనం హిందూ మహాసముద్రంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దాని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. యానాం, ఆంధ్రప్రదేశ్ లో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఈశాన్య దిశగా గాలులు వీచనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో శనివారం నాడు ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి.
డిసెంబర్ 8న వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ,పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు వర్షాలకు తడిచిపోకుండా ధాన్యం జాగ్రత్త చేసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ కేంద్రం సూచించింది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు నుంచి రోజులపాటు తేలికపాటి జల్లులు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నాడు ప్రొఫెసర్ జయశంకర్ భూపాళపల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురవనుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రత 22.5 డ్రిగీలు, గరిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీలు నమోదైంది.
ఆదివారం, సోమవారం వర్షాలు
తెలంగాణలో ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, హన్మకొండ, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, జనగామ, ములుగు, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
సోమవారం నాడు మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని, కానీ చలి గాలుల తీవ్రత పెరగుతుందని పేర్కొన్నారు.
Also Read: KTR News: కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు, వెంటనే ఎస్పీకి ఫోన్ కొట్టిన బీఆర్ఎస్ నేత