Telangana Weather News Today | అమరావతి/ హైదరాబాద్: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, లేకపోతే తేలికపాటి వర్షం కురిసినా తడిచిపోయే అవకాశం ఉందన్నారు. 


నవంబర్ 16న శనివారం ఈ జిల్లాల్లో వర్షాలు...
ఏపీలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. శనివారం నాడు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంట బలమైన గాలులు వీచనున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు కనుక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.






శుక్రవారం పలుజిల్లాల్లో వర్షాలు
ఏపీలో కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు  జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.



తెలంగాణలో వెదర్ అప్‌డేట్


తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలకు అవకాశం లేదు కనుక ఎలాంటి అలర్ట్ జారీ కాలేదు. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం కొంచెం ఉక్కపోత.. సాయంత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీచనున్నాయి. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. 






కేరళ తీరానికి సమీపంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో పుదుచ్చేరి, కారైక్కాల్‌ లో తేలికపాటి వర్షాలు కురిశాయి. శనివారం నాడు చెన్నై, దాని పరిసర ప్రాంతాలతో పాటు కోయంబత్తూరు, నీలగిరి, తిరుపూరు, తేని, దిండిగల్‌ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.