TDP Manifesto : ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న టీడీపీ వచ్చే సార్వత్రిక ఎన్నికలపై దృష్టిపెట్టింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది టీడీపీ. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో... ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనపై చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమానికి నాంది పలికింది టీడీపీ అన్న చంద్రబాబు... పేదలకు ఇప్పుడు అందుతున్న దాని కంటే రెట్టింపు సంక్షేమం అందించేలా మేనిఫెస్టో రూపొందించాలని సూచనలు చేశారు. ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో ఉండాలని చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేశారు.
ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి- 100 సభలు
మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో మహానాడు ఘనంగా నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎన్టీఆర్ శతజయంతిని ఘనంగా నిర్వహించాలని, రాష్ట్రవ్యాప్తంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోను భిన్నంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తుంది టీడీపీ. ఆర్థిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా మేనిఫెస్టో రూపొందించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలాఖరు వరకూ 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
నవంబర్ లో ఎన్నికలు
నవంబర్‌లో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు సంసిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ సభ్యత్వంలో లైఫ్ టైమ్ మెంబర్‌షిప్‌ను చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.5 వేల రుసుముగా పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయంపై చంద్రబాబు విశ్లేషణ చేశారు. మూడు స్థానాల్లో టీడీపీ గెలవడంపై పొలిట్ బ్యూరో నేతలు విశ్లేషించారు. వైసీపీ నేతలు ఓటుకు డబ్బులు ఇచ్చినా ఓటర్లు ప్రభావితం కాలేదని పొలిట్ బ్యూరో భావిస్తుంది.
ఏపీలో ముందస్తు ఎన్నికలు
ఏపీలో ముందస్తు ఎన్నికలపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జనసేనతో పొత్తు నిర్ణయం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలకు పది కోట్లు కాదు పది వేల రూపాయల ఖరీదు కూడా చేయరని బోండా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కొనుగోలుపై వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. టీడీపీ విజయాన్ని తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు.