Chandrababu : హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం కలిశారు. కుప్పంలో ఇటీవల జరిగిన సంఘటనలపై చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం ఇరువురు ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సభ పెట్టుకునేందుకు ఎక్కడా సభ ఇవ్వనంటే ఇప్పటం గ్రామంలో రైతులు ముందుకొచ్చి సభకు భూములిచ్చారని చంద్రబాబు తెలిపారు. అందుకు వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి ఇప్పటం గ్రామస్థుల ఇళ్లు కూల్చేశారని ఆరోపించారు. అనంతరం పవన్ పరామర్శించేందుకు వెళ్తే వాహనాలను అనుమతించలేదు. పైగా రోడ్డు వెడల్పు చేయడానికి ఇళ్లు పడగొట్టామని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఆత్మకూరులో వందల కుటుంబాలను బహిష్కరిస్తే వాళ్లను పరామర్శించేందుకు వెళ్తే తన ఇంటి గేటు తాళ్లు కట్టి వెళ్లనీయకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. 


నా ఇంటిపై దాడి చేశారు 


"విశాఖపట్నం వెళ్తే అక్కడ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు లా అండ్ ప్రొబ్లమ్స్ వచ్చేస్తున్నాయని తిరిగి పంపించేశారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నామినేషన్లను అడ్డుకుంటున్నారని వాళ్లకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తే అక్కడ నన్ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తే నాపై రాళ్లతో, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. అప్పుడు డీజీపీ...ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇంటి వద్ద ఉంటే వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి జోగి రమేష్ నా ఇంటిపైకి కర్రలతో దాడికి వచ్చారు. పైగా నాకు రిప్రజంటేషన్ ఇచ్చేందుకు వచ్చారని పోలీసులు అన్నారు. గంజాయి, డ్రగ్స్ పై పోరాటం చేస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారు.  నా ఆఫీసుపై దాడి చేసి కనీసం వారిపై కేసు కూడా పెట్టలేదు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. రాజకీయ పార్టీలకు నిర్థిష్టమైన ఆలోచన ఉంటాయి. వైసీపీ మాత్రం దాడులు చేయడం, ఎవరైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్లపై దాడులు చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాయి." - చంద్రబాబు 


ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతవరకైనా వెళ్తాం 


"ఇప్పుడు బ్రిటీష్ కాలం నాటి జీవో తెచ్చారు. ఆ జీవో అమల్లో ఉందో లేదో కూడా తెలియదు. చీకటి జీవో నెం 1 తీసుకొచ్చి నా నియోజకవర్గంలోకి వెళ్తే నన్ను అడ్డుకున్నారు. నా నియోజకవర్గంలోకి నన్ను రానీయకుండా చేసేందుకు వేల సంఖ్యలో పోలీసులను మోహరించి నన్ను తిరిగి పంపించే ప్రయత్నం చేశారు. నేను మీటింగ్ పెట్టుకుంటే నా మీటింగ్ వైసీపీ నేతలను పంపించి మాపై దాడి చేశారు. తిరిగి మాపై కేసులు పెట్టారు. పోలీసులే ఈ కేసులు పెట్టారు. మహిళలు వాళ్లపై హత్యా ప్రయత్నం చేశారని పోలీసులు కేసులు పెట్టారు. చరిత్రలో తొలిసారి పోలీసులపైనే కేసుల పెట్టే పరిస్థితి వచ్చింది. జీవో నెం 1 ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితిలేదు. ముఖ్యమంత్రి రోడ్ షోలు చేసుకోవచ్చు. సభలు పెట్టుకోవచ్చు. కానీ ఇంకెవ్వరూ సభలు పెట్టకూడదు. కందుకూరు, గుంటూరు ఘటనలను సాకులుగా చూపించి జీవో నెం 1 తెచ్చారు. గుంటూరు ఘటన వైసీపీ నేతల కుట్రే. పోలీసులు తమ కనీస బాధ్యత మరిచి ఆంక్షలు విధిస్తున్నారు. కందుకూరు, గుంటూరు ఘటనలు వైసీపీ కుట్ర, అమలుచేసింది పోలీసులు.  ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక మొదలైంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎంతవరకైనా వెళ్తాం." - చంద్రబాబు