How To Apply Pension Scheme In Ap: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సీఎం చంద్రబాబు 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం (జులై 1) ప్రారంభించారు. మంగళగిరిలోని పెనుమాకలో లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా అందజేశారు. అటు, రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. సోమవారమే పూర్తి స్థాయిలో పింఛన్లు పంపిణీ పూర్తయ్యేలా ఉద్యోగులు చర్యలు చేపట్టారు. అయితే, రాష్ట్రంలో అర్హత ఉన్నా కొంతమందికి ఇంకా పింఛన్లు అందడం లేదు. మరి అలాంటి వారు ఆఫ్ లైన్, ఆన్ లైన్‌లోనూ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు పరిశీలన అనంతరం వెంటనే పింఛన్ వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు.
అర్హులు వీరే
'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ పథకం కింద.. వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, చెప్పులు కుట్టేవారు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్స్, హెచ్ఐవీ బాధితులు, చేతి వృత్తుల వారు పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కాగా, సాధారణ లబ్ధిదారులకు నెలకు రూ.4000, వికలాంగులకు నెలకు రూ.6000 , పూర్తిగా వికలాంగులకు నెలకు రూ.15,000, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి నెలకు రూ.10,000 పింఛన్ నగదు అందజేస్తారు.
ఆన్ లైన్‌లో దరఖాస్తు ఇలా..
- పెన్షన్లకు సంబంధించి అధికారిక పోర్టల్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index కు వెళ్లి కుడివైపున ఉన్న లాగిన్‌పై క్లిక్ చేయాలి.
- క్రెడిన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత 'గెట్ OTP' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు OTP వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత దరఖాస్తు ఓపెన్ అవుతుంది.
- అనంతరం అక్కడ ఇచ్చిన సూచనల ఆధారంగా మీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు స్క్రూటినీ అనంతరం అధికారులు పెన్షన్ అందిస్తారు.
ఆఫ్ లైన్‍లో ఇలా..
- ప్రభుత్వ అధికారిక పోర్టల్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index కు వెళ్లి 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ యోజన దరఖాస్తును డౌన్ లోడ్ చేయాలి.
- ఆ ఫారం ప్రింట్ అవుట్ తీసుకుని మీ పూర్తి వివరాలను నింపాలి. పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇలా అన్ని వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా నింపాలి.
- ఆ దరఖాస్తు ఫారానికి అడ్రస్ ఫ్రూఫ్, తెల్లరేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా అవసరమైన పత్రాలు జత చేయాలి.
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, సంబంధిత పత్రాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తు పరిశీలన అనంతరం పింఛన్ మంజూరు చేస్తారు.
పింఛన్లకు సంబంధించి మరిన్ని వివరాలు లేదా సహాయం కోసం 0866 - 2410017 నెంబరుకు కాల్ చెయ్యొచ్చు. లేదా Society for eradication of rural provety, 2nd floor, Dr.N.T.R Administrative Block, Pandit Nehru RTC Bus Complex, Vijawada, Andhrapradesh - 520001 చిరునామాలో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.