YSRCP Politics | అమరావతి: వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2 గా ప్రభావం చూపిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇంకో మూడేళ్లు ఉండగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి సైతం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత జగన్ కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో చెప్పిన విధంగానే వ్యవసాయం మొదలుపెట్టారు. ఇప్పుడు వైసీపీకి మిగిలిన రాజ్యసభ సభ్యులు ఎందరు.. వారు ఎవరెవరు అన్నదానిపై సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలైంది. సాధారణంగా లోక్ సభ సభ్యులు జనాల్లోంచి డైరెక్ట్ గా ఎన్నికవుతారు. కాబట్టి వారికున్న పాపులారిటీ రాజ్యసభ సభ్యులకు అంతగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి అసలు వైసీపీ రాజ్యసభ  సభ్యులు ఎవరెవరు అన్న దానిపై కామన్ మేన్ వెతుకులాట మొదలుపెట్టాడు


 మొత్తం 11... మిగిలింది ఏడు!


 2024లో అధికారం కోల్పోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య మొత్తం 11. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు,R కృష్ణయ్య, విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమల్ నత్వాని, మేడా రఘునాథరెడ్డి. ఈ 11 మందిలో బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, R కృష్ణయ్య ఇప్పటికే పార్టీకి రాజీనామాలు చేశారు. తాజాగా విజయసారెడ్డి తో రాజీనామా చేసిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 


మిగిలిన ఏడుగురులో నిలిచేది ఎవరు?


పార్టీ అధికారం కోల్పోగానే వెంటనే కండువా మార్చేసే జంపు జిలానీలు రాజకీయాల్లో ఎక్కువైపోతున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. కాకపోతే ఇప్పుడు ఆ వంతు వైసీపీకి వచ్చిందంతే. మిగిలిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో పరిమల్  నత్వానిది సపరేట్ కేసు. అంబానీ ల స్నేహితుడిగా. బిజెపి సన్నిహితుడుగా  వారి అభ్యర్థన మేరకు జగన్ అప్పట్లో రాజ్యసభ సీటు కట్టుబెట్టారు. మిగిలిన వారిలో వైవి సుబ్బారెడ్డి, సుభాష్ చంద్రబోస్ జగన్ కు అత్యంత నమ్మకస్తులు. నిరంజన్ రెడ్డి స్వయంగా జగన్ కేసులు వాదించే న్యాయవాది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి పార్టీని వీడతారంటూ ప్రచారం గట్టిగా జరిగినా ఇటువంటిది ఏమీ లేదని ఇద్దరూ ఖండించారు.


అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు పార్టీని వీడి పరిస్థితుల కారణంగా తిరిగి మళ్లీ వైసీపీ లోనే చేరారు. కడప కు చెందిన రఘునాథరెడ్డి సోదరుడు మల్లికార్జున రెడ్డి గత ఎన్నికల్లో  టీడీపీ కి అనుకూలంగా పనిచేశారు. దానితో ఈ ఇద్దరు ఎంపీలపై ఇలాంటి ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. వైసీపీకి చెందిన మరొక రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు పై కూడా మొదట్లో ఇలాంటి ప్రచారమే వచ్చినా తాను వైయస్సార్ భక్తుడనని, చివరి వరకూ వైసిపి తోటే ఉంటానని స్పష్టం చేయడంతో ప్రస్తుతానికైతే ఆ ప్రచారం ఆగిపోయింది. కానీ అధికారమే లక్ష్యంగా నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం అంటున్నారు పరిణామాలు గమనిస్తున్న వారు.


Also Read: AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత