CM Jagan Birth Day Special: ఈరోజు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఆయన వయసు కేవలం 47 ఏళ్లు. అధికారం చేపట్టాక ఈ నాలుగున్నరేళ్లలో ఆయన విధ్వంసం సృష్టించారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నా.. ఓ వర్గం మాత్రం ఆయన్ను దేవుడంటోంది. ఆయన పాలన ఎలా ఉంది అనే విషయాన్ని పక్కనపెడితే.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు జగన్ చేసిన ప్రయాణం మాత్రం ఓ సాహసం అనే చెప్పాలి. 


తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం కేవలం ఎంపీగా పోటీ చేసి గెలిచే వరకే జగన్ కు పరిమితం అయింది. తండ్రి మరణం తర్వాత జగన్ లో అసలు నాయకుడు బయటకొచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆ నాయకుడు బయటకు వచ్చేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. జగన్ జైలుకెళ్లడానికి కాంగ్రెస్ కారణమా, కాదా అనేది తేల్చి చెప్పలేం కానీ.. ఆ జైలు జీవితం తర్వాత ఆయన మరింత రాటుదేలారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు ఆ ప్రయాణం సాగింది. అదే సమయంలో తనను అవమానించిన కాంగ్రెస్ పార్టీని ఏపీలో అధఃపాతాళానికి తొక్కేసే వరకు ఆ పగ కొనసాగింది. 


జగన్ ఎందుకంత స్పెషల్..?
వైఎస్ మరణానంతరం జగన్ సీఎం కావాలనుకున్నారు, కానీ కుదర్లేదు. తండ్రి శవం దగ్గరే సంతకాల సేకరణ మొదలు పెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. వైఎస్ కి తోడునీడలా ఉన్న చాలామంది జగన్ ని దగ్గరకు రానివ్వలేదు. కాంగ్రెస్ అధిష్టానానికి బద్దులుగా ఉంటూ ఆనాడు ఉన్నత పదవులు అందుకున్నారు. కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మాట వినలేదు. ఓదార్పు యాత్రతో అధిష్టానానికి ఎదురు తిరిగారు. అప్పుడు సర్దుకుపోయి ఉంటే ఈరోజు ఏపీకి సీఎంగా జగన్ ఉండేవారు కాదేమో. ఎంపీగా కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవారేమో. కానీ జగన్ కాంగ్రెస్ కి ఎదురుతిరగడం, ప్రజలు ఆయనకు అండగా నిలబడటంతో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. 


1972 డిసెంబర్‌ 21న కడపజిల్లా జమ్మలమడుగు మిషన్‌ ఆస్పత్రిలో జన్మించారు జగన్. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఆ తర్వాత డిగ్రీ ప్రగతి మహావిద్యాలయలో డిగ్రీ చేశారు జగన్. ముందుగా వ్యాపారవేత్తగా రాణించారు. ఆ తర్వాత తండ్రి బాటలో రాజకీయాల్లో ప్రవేశించారు. తండ్రి మరణం తర్వాత పూర్తిస్థాయి నాయకుడిగా ఎదిగారు. ప్రాంతీయ పార్టీని స్థాపించి కేవలం 8 ఏళ్లలోనే అధికారంలోకి రాగలిగారు, ఏపీకి ముఖ్యమంత్రి కాగలిగారు. 


వైసీపీ ప్రస్థానం..
2011లో జగన్ తన తండ్రిపేర ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు జగన్ ఏపీలో సొంతగా అధికారంలోకి వస్తారని, టీడీపీని ఓడిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. బహుశా 2019 వరకు కూడా ఆ ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు. కానీ టీడీపీని కేవలం 23 స్థానాలకు పరిమితం చేసి 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం అంటే మాటలు కాదు. 2014లో 70 సీట్లు గెలిచి సత్తా చాటినా అధికారం మాత్రం వైసీపీ దరిచేరలేదు. అదే సమయంలో టీడీపీ ఒత్తిడితో ఎమ్మెల్యేలు, ఎంపీలు చేజారినా కూడా జగన్ దిగులుపడలేదు, భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. ఆ మొండితనమే ఆయన్ను 2019 ఎన్నికలకు సన్నద్ధం చేసింది. 151 స్థానాల రికార్డు విజయాన్ని అందించింది. ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిగిలి ఉన్నా కూడా.. 294 స్థానాల అసెంబ్లీలో 151 స్థానాలతో వైసీపీ అధికార పార్టీగా మారేది. ఆ స్థాయిలో జగన్ కి జనం బ్రహ్మరథం పట్టారు. 


భవిష్యత్ ఏంటి..?
జగన్ పై కేసులున్నమాట నిజమే. ఆయన పూర్తి స్థాయిలో నిర్దోషి కాదు, పైగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం కూడా ఆయనకు, కుటుంబానికి తలనొప్పిగా మారింది. ఉచితాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమంతోనే సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. వీటన్నిటినీ తట్టుకుని వచ్చే ఎన్నికల్లో జగన్ నిలబడగలరా..? అభ్యర్థుల్ని మార్చేస్తూ విపరీతంగా ప్రయోగాలు చేస్తున్న జగన్ కి 2024లో వైనాట్ 175 సాధ్యమేనా..? వేచి చూడాలి.