Janasena On CM Jagan :   మీ బిడ్డనంటూ బహిరంగసభల్లో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన సెటైర్ వేసింది. ఇంట్లో వాళ్లనే నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడని.. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న నేతగా పేరు పడిన జగన్మోహన్  రెడ్డిని ఏ కుటుంబమూ తమ బిడ్డగా ఒప్పుకోదని ని మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుని పదే పదే మీ బిడ్డ అని జగన్ ప్రసంగించడం ఆపాలని సలహా ఇచ్చారు. రైతులు వేదనలో ఉంటే కనీసం పలకరించని నాయకుడు జగన్ రెడ్డి అని.. మాండౌస్ తుపాను పరిహారం ఇప్పటకిీ సరిగ్గా ఇవ్వలేదన్నారు. విపత్తులు వచ్చిన ప్రతీసారి వారిని అనాథలుగా వదిలేశారని ఆరోపించారు.  





పండించిన ధాన్యం కొనమని అడిగితే రైతుల్ని అరెస్ట్ చేియంచారని .. ఇలాంటి పాలకు దాష్టీకాన్ని రైతాంగం ఇంకా మర్చిపోలేదన్నారు. కర్ణాటక పర్యటనలో ప్రధానమంత్రి పీఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లలోకి జమ చేస్తే మళ్లీ అవే డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం  బటన్ నొక్కడం ఏమిటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. నాలుగేళ్లకు కలిపి ప్రతీ రైతుకు రూ. యాభై నాలుగు వేల సాయం అందించామని చెబుతున్న ఈ ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలతో మభ్య పెడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో రైతులకు ఇచ్చింది కేవలం రూ. ఇరవై ఆరు వేలు మాత్రమేనన్నారు. 


తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాఫ్టర్ ప్రయాణం చేయడంపై నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. 26 కిలోమీటర్లు ఉన్న  తెనాలికి రోడ్లపై వెళ్లడానికి జగన్ భయపడ్డారని.. గుంతలు పడి ఉన్న రోడ్లను చూసే తీరిక లేదన్నారు. హెలికాఫ్టర్ పర్యటనకు అలవాటు పడిన సీఎంకు ప్రజల బాధలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. రూ. 6300 కోట్ల అవినీతికి మూలమైన రైతు భరోసా కేంద్రాల గురించి ఈ ముఖ్యమంత్రి గొప్పగా చెబుతారని ఎద్దేవా చేశారు. ఇంత ఖర్చు చేసినా... ఆర్బీకేల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని మనోహర్ ప్రశ్నించారు. 


దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి క్లాస్ వార్ గురించి మాట్లాడుతూంటే ప్రజలు నవ్వుతున్నారని మనోహర్ స్పష్టం చేశారు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. ఆయన సంపాదించిన దాంట్లో పది శాతం రాష్ట్ర ప్రజలకు పంచి అప్పులు వార్లు గురించి మాట్లాడాలన్నారు. ప్రతీ నియోజకర్గంలో పోటీ చేసే దమ్ము, ధైర్యం జనసేనకు ఉందని.. ఎన్నికల సమయంలో దాని గురించి చూసుకుందామన్నారు. ప్రజాధనంతో నిర్వహించే ప్రభుత్వ సభల్లో ఎలా మాట్లాడాలో రాజకీయ ఉపన్యాసాలు ఎందుకు ఇవ్వకూడదో జగన్ తెలుసుకోవాలన్నారు.  కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వడం లేదో జగన్ చెప్పిన తర్వాతనే ... రైతు సంక్షేమంపై మాట్లాడాలన్నారు.