CRPF security to MP Mithun Reddy :  వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించింది. తనపై దాడులు జరుగుతున్నాయని ఇటీవల పుంగనూరులో పర్యటించిన సమయంలో జరిగిన ఘటల్ని ఆయన కేంద్ర హోంశాఖకు వివరించారు. ఆ రోజు జరిగిన గొడవల్లో మిథున్ రెడ్డి గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ వాహనాన్ని కూడా దుండగులు తగులబెట్టారు. ఈ పరిణామాల తర్వాత తనకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న  భద్రత సరిపోదని సీఆర్పీఎఫ్ భద్రత కావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 


రాజంపేట నుంచి మూడోసారి గెలిచిన  మిథున్ రెడ్డి               


పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి మూడో సారి విజయం సాధించారు. ఆయన తండ్రి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గాన్ని వ్యక్తిగత సామ్రాజ్యం అన్నట్లుగా మార్చుకుని ఇతర పార్టీల నేతలపై దాడుల చేయడంతో.. ప్రభుత్వం మారిన తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటన్నారు. గెలిచినప్పటికీ పుంగనూరు వెళ్లేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ప్రయత్నం చేయడం లేదు. ఆయన వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు ఇప్పటికే ఆందోళనలు చేశారు. ఇప్పటికే ఓ సారి ఆయన తన పర్యటన ప్రకటించి వాయిదా వేసుకున్నారు. మరోసారి పుంగనూరు వెళ్లే ప్రయత్నం చేయలేదు. 


పుంగనూరుకు వెళ్తే ఘర్షణలు         


మరో వైపు ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం పుంగనూరు వెళ్లేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నం చేశారు. తిరుపతిలోనే పోలీసులు ఆయనను రెండు సార్లు ఆపారు. అయితే ఓ సారి ఎవరికీ చెప్పకుండా ఆయన పుంగనూరులో ప్రత్యక్షం కావడంతో గొడవలు జరిగాయి. ఈ సందర్భంగా  రోజంతా  పుంగనూరులో ఉద్రిక్తత ఏర్పడింది . తర్వాత రోజు కూడా ఆయన పుంగనూరు నియోజకవర్గంలోని సదుంలో పర్యటించారు. అప్పుడు గొడవలేమీ జరగలేదు. తమకు రక్షణ కావాలని అడిగిన ఎంపీలకు ప్రత్యేకంగా కొన్ని  షరతులతో కేంద్ర హోంశాఖ రక్షణ కల్పిస్తుంది. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుకు కూడా సీఆర్పీఎఫ్ భద్రత కల్పించారు. అయినప్పటికీ ఆయనను హైదరాబాద్‌లో  ఏపీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.         


జగన్ కూడా కేంద్ర సెక్యూరిటీ కోరే అవకాశం 


మాజీ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర బద్రత కోసం లేఖ రాసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తనకు కల్పిస్తున్న భద్రతపై సంతృప్తిగా లేరు.  తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని  కోర్టులో పిటిషన్ వేశారు.  నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయితే రాష్ట్ర సెక్యూరిటీ కన్నా కేంద్ర సెక్యూరిటీ కాావాలని ఆయన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.