YS Viveka  Case :  వైఎస్  వివేకానందరెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ సుదీర్ఘంగా జరుగుతోంది. ఇరు వైపుల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్‌ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్‌ అన్నారు. కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్‌ వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్‌షీట్‌లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అని జడ్జి ప్రశ్నించారు.                 


దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్‌మెంట్‌ తీసుకుందని, మొదటి స్టేట్‌మెంట్‌లో ఎక్కడ అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ లాయర్‌ చెప్పారు. చివరి స్టేట్‌మెంట్‌లో గంగిరెడ్డి తనతో చెప్పిన వ్యాఖ్యలలో అవినాష్ తమ వెనుకాల ఉన్నాడని చెప్పినట్టు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని లాయర్‌ పేర్కొన్నారు. అందరి వాదనలు శుక్రవారమే వింటామని ఆయన కుమార్తె సునీతారెడ్డికి తెలంగాణ హైకోర్టు ల్చి చెప్పింది. అవినాష్ తరపు లాయర్‌కు ఎంత సమయం ఇచ్చారో... తమకూ అంతే సమయం ఇవ్వాలన్న సునీతా రెడ్డి తరపు లాయర్‌‌పై జడ్జి అసహనం వ్యక్తం చేశారు.                           


మరో వైపు ఎర్ర గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేస్తూ... తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై న్యాయస్థానం విచారణ జరిపింది. జులై 1 తరువాత బెయిల్ ఇవ్వాలని హై కోర్టు ఇచ్చిన తీర్పు ఎనిమిదో వింత లాగా ఉందని గత విచారణ సందర్భంగా సీబీఐ తరపున హాజరైన అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ సంజయ్ జైన్ అన్నారు. కాగా గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీతా పిటిషన్ దాఖలు చేశారు.       


జూన్ 30వ తేదీలోపు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ మరుసటి రోజు జులై 1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని ట్ర‌య‌ల్ కోర్టును హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. జులై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ట్రయిల్ కోర్టును ఆదేశిస్తూ... బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. అలాగే జులై 1న బెయిల్ ఇవ్వాలని షరతు విధిస్తూ... హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వివేక కుమార్తె సునీత... సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై గతంలో విచారణ సందర్భంగా సీజేఐ ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్‌ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.