Mla Balakrishna : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రమాదం తప్పంది. హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన  'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రచారం వాహనంపై నుంచి బాలకృష్ణ జారిపడబోయారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు బాలకృష్ణను పట్టుకున్నారు. దీంతో బాలయ్యకు ప్రమాదం తప్పింది. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో ఆయన వెనక్కి తుళ్లి పడిపోయారు. వాహనంపై ఉన్న కార్యకర్తలు బాలకృష్ణ పట్టుకున్నారు. 



 వైసీపీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు


సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక్క ఛాన్స్‌  అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ కు ఇసుక, వైన్‌, మైన్‌ తప్ప ప్రజల ఇబ్బందులు పట్టడం లేదని విమర్శించారు. నారా లోకేశ్‌ చేయనున్న యువగళం పాదయాత్రతో వైసీపీ నాయకుల్లో భయపట్టుకుందన్నారు.  వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత యువగళంతో బయటపడుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. ఉపాధి అవకాశాలు లేక రాయలసీమ యువత వలసలు వెళ్లిపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని, ఉపాధి అవకాశాలు లేక యువత ఆందోళన చెందుతున్నారని బాలకృష్ణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని బాలకృష్ణ అన్నారు. 


చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం


వైసీపీ ప్రభుత్వం , సీఎం జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శలు చేశారు.  తెలంగాణలో కాళ్లు మొక్కుతా బాంచన్ అన్న విధంగా ఏపీలో పాలన ఉందన్నారు. ఓట్లేసి గెలిపించుకుంటే బాదుడే బాదుడే తెచ్చారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా... మూడు రాజధానులని మూడేళ్లు గడిపారని ఎద్దేవా చేశారు. నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. సీఎం జగన్ కు పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అధ్వాన్నంగా మార్చారన్నారు.  ప్రజలు ఉచిత పథకాల మోజులో మోసపోకండని సూచించారు.  అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం, ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని నిలిపివేశారని బాలకృష్ణ విమర్శించారు. సీఎం జగన్ అసలు మనిషే కాదన్నారు. కియా కార్ల సంస్థను చంద్రబాబు తీస్తే, అనుబంధ సంస్థలు జగన్ దెబ్బకు పారిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత గంజాయికి అలవాటు పడుతున్నారని ఆక్షేపించారు. గంజాయిలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని ఆరోపించారు. చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. దావోస్ లో రాష్ట్రం తరఫున ఒక్కరూ వెళ్లలేదన్నారు. 


అక్కినేని వివాదంపై స్పందిస్తూ


అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.  హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన  అక్కినేని.., తొక్కినేని అంటూ వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు తనపై తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ చూపేవారన్నారు. తాను బాబాయ్ అని పిలుచుకునేవాడిని.. ఆయనపై ప్రేమ తనకు గుండెల్లో ఉంటుందన్నారు. పొగడ్తలకు పొంగి పోకూడనదే విషయాన్ని తాను అక్కినేని నాగేశ్వరరావు నుంచే నేర్చుకున్నానన్నరు. ఎన్టీఆర్‌ను ఎన్టీవోడు అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసలో పిలుస్తూంటారు..అదంతా ఆయనపై చూపే అభిమానమేనని గుర్తు చేశారు. ఏదో ఫ్లో లో వచ్చిన మాటలను వక్రీకరించుకుని వ్యతిరేక ప్రచారం చేస్తే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని.. స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పెడితే మొదట .. అక్కినేని నాగేశ్వరరావుకే అవార్డు ఇచ్చామని గుర్తు చేశారు.