AP HighCourt :     ఆమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ చట్ట విరుద్దమంటూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని భూములు రాజధాని అవసరాలకు కాకుండా ఇతరులకు కేటాయించకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిందని .. అందుకే అలాంటి జోన్ ఏర్పాటుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతుల తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులపై వాదనలు వినేందుకు ఈనెల 19కి కేసు విచారణను వాయిదా వేసింది.


రాజధాని వెలుపల ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 1134 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసింది.  రాజధాని భూములను వేరే అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పుఇచ్చిన విషయాన్ని వాదనల్లో  పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దేవదత్త కామత్, ఆంజనేయులు, ఉన్నం మురళిధర్ చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వివరించారు.  ఇప్పటికే సుప్రీంకోర్టు  లో కేసు విచారణలో ఉందని అక్కడికి వెళ్ల వచ్చుగా అని  ధర్మాసనం సూచించింది. అదే సమయంలో ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే అభివృద్ది కార్యక్రమాలు అడ్డుకోవడం లేదని రాజధాని భూములు విషయంలో మాత్రమే తాము వాదనలు వినిపిస్తున్నామని న్యాయవాదులు చెప్పారు. 


రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయసమ్మతం కాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడుతామని ఏపీ హైకోర్టు పేర్కొంది. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సీఆర్డీఏ వైఖరిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీకి వెళ్లే కరకట్ట పక్కన సీఆర్డిఏకు వ్యతిరేకంగా రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పొలాలపై తమకే హక్కు లేకుండా చేస్తున్న సీఆర్డీఏ సంస్థ వైఖరిని ఖండిస్తున్నామని ఉండవల్లి రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ తీరును వ్యతిరేకిస్తూ ఉండవల్లి రైతులు ఆందోళనకు కూడా చేశారు. రహదారి విస్తీర్ణం పేరుతో పరిహారంతో సంబంధం లేకుండా మీ పొలాలని మేము తీసుకున్నాం అని సీఆర్డీఏ అధికారులు రైతులకి నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


మీ పొలాలకు మీకు సంబంధం లేదంటూ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమైన చర్య అని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. VRO రాణి ఇప్పటికే పలువురు రైతులకు ఫోన్లు చేసి మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి మీ కులం ఏమిటి అని పదే పదే ప్రశ్నిస్తున్నారని వాపోయారు. రహదారికి మేము వ్యతిరేకం కాదని, పరిహారం చెల్లిస్తే మేము ఎలాంటి అడ్డంకులు తెలపామని రైతులు మరోసారి స్పష్టం చేశారు. భూములను ప్రభుత్వం అమ్మాలంటే ఒక న్యాయం, రైతు దగ్గర తీసుకోవాలంటే మరో న్యాయమా అని ఉండవల్లి రైతులు ప్రశ్నిస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు మాకు సరైన పరిహారం ఇచ్చే దాకా మా పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదని బాధిత రైతులు చెబుతున్నారు. ఈ అంశంపై రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.