Heavy Rains in AP: ఏపీలో గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నారు. వరుణ దేవుడి కరుణతో రాష్ట్రంలోని వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. అయినా వర్షం కురుస్తూనే ఉంది. ఈక్రమంలోనే ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ, నంద్యాల, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అలాగే భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. కుండపోత వర్షాలతో రాష్ట్రమంతా చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు ఎడతెగని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 208 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
ఈరోజు అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు చెప్పారు. ప్రస్తుత వాతావరణ అంచనా బట్టి ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. భారీ వర్షాలు, వరదలు నేపధ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రంగాన్ని అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
మరోవైపు బుధవారం (జూలై 26) సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా తామడలో 145 మిమీ, విజయనగరం జిల్లా గోవిందపురంలో 136 మిమీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 114 మిమీ, విశాఖపట్నంలో 111 మిమీ అధిక వర్షపాతం, దాదాపు 41 ప్రాంతాల్లో 60 మి.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఏలూరు జిల్లాలో 7.8 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదు అయింది. తర్వాత విశాఖ జిల్లాలో రిజిస్టర్ అయింది. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని రెండు రోజులుగా చెబుతున్న వాతావరణ శాఖాధికారులు పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాలు ముంపు బారిన పడితే అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అంబేడ్కర్, ఏలూరు జిల్లాల్లో నాలుగేసి సహాయక బృందాలను పంపించారు. ప్రత్యేక బోట్లు, లైఫ్ జాకెట్లు కూడా సిద్ధం చేశారు.