Dana Cyclone In AP: తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, మంగళవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఇది పశ్చిమబెంగాల్, ఒడిశా తీరం వైపు కదులుతుందన్నారు. ప్రస్తుతం ఉత్తర అండమాన్‌పై అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అల్పపీడనం ఈ నెల 24వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని.. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.


తుపానుగా ఏర్పడిన తర్వాత ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రభావం చూపుతుందన్నారు. ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. కాబట్టి ఒడిశా వైపు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు వెనక్కు రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 


'దానా' తుపాను


ఈ తుపానుకు 'దానా'గా నామకరణం చేయనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 - 46 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


తెలంగాణలోనూ..


అటు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం.. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర అండమాన్ సముద్ర ఎగువ ప్రాంతంలో ఆవర్తనం కారణంగా సోమవారం ఉదయం తూర్పు - మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 22వ తేదీ ఉదయం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 23న తుపానుగా ఏర్పడి.. వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 24న ఒడిశా - పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని వెల్లడించింది.


Also Read: Pawan Kalyan in Gurla: ఐదేళ్లు పంచాయతీ నిధుల దుర్వినియోగం వల్లే గర్ల ఘటనలు - బాధిత కుటుంబాలకు పవన్ వ్యక్తిగత సాయం !