Rains In AP Districts: ఏపీని వర్షాలు వీడడం లేదు. గత కొద్ది రోజులుగా కోస్తాంధ్ర సహా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగ, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు.. ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అటు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.






ఈ జిల్లాలకు అలర్ట్


శనివారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూ.గో, ప.గో, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఆదివారం, ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అటు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో కొనిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు.. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.


అటు, విజయవాడలో (Vijayawada) మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే నగరం కోలుకుంటోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసింది. రోడ్లపై బురద, చెత్తా చెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా డ్రోన్లతో బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ప్రభుత్వం నిత్యావసర కిట్లు అందజేస్తోంది. మరోవైపు, బుడమేరు గండ్లను సైతం పూర్తిగా పూడ్చేశారు. ఇప్పటికే 2 గండ్లను పూడ్చేయగా.. మూడో గండిని శనివారం మధ్యాహ్నానికి పూడ్చేశారు. దీంతో వరద ప్రవాహం తగ్గినట్లయింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) అక్కడే ఉంటూ పనులను నిరంతరం పర్యవేక్షించారు. కాగా, గండ్ల పూడ్చివేతకు రాష్ట్ర  అధికారులతో పాటు సైన్యం రంగంలోకి దిగింది. అటు, గండ్లను విజయవంతంగా పూడ్చిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.


Also Read: Budameru: బుడమేరు గండ్లు పూడ్చివేత - విజయవాడకు తప్పిన వరద ముప్పు