Rains In AP: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా (Anakapalli District) పాయకరావుపేట నియోజకవర్గంలోని తాండవ, వరాహ నదులు ఉగ్రరూపం దాల్చాయి. భారీ వర్షాలతో ఎస్.రాయవరం మండలం ఇందేసమ్మ వాగు ఉద్ధృతికి ఘాట్ రోడ్డు కోతకు గురైంది. పట్టణంలోని తాండవ నదికి ఆనుకుని ఉన్న చాకలిపేట ఇంకా ముంపులోనే ఉంది. సత్యవరం వద్ద తాండవ నది వంతెన పైనుంచి వరద ప్రవహించడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించి పరిస్థితి సమీక్షించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని.. వరదలు తగ్గుముఖం పట్టే వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
విష జ్వరాల విజృంభణ
అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు పూర్థిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో చెత్తాచెదారం భారీగా పేరుకుపోయింది. అపరిశుభ్రత విపరీతంగా పెరిగి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. గత వారం రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది.
త్వరలో 'ఆపరేషన్ బుడమేరు'
అటు, గత కొద్ది రోజులుగా వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరం తేరుకుంటోంది. మంగళవారం సాయంత్రానికి సాధారణ స్థితికి తెచ్చేలా చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని.. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ ఆహారం అందిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు, త్వరలో 'ఆపరేషన్ బుడమేరు' చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని.. అక్కడ ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకూ 77 వేల విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించామని.. వరద ప్రాంతాల్లో నీటిని మరో రెండ్రోజులు తాగొద్దని ప్రజలకు సూచించినట్లు పేర్కొన్నారు.