Andhra Pradesh Heatwave Alert | అమరావతి: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో మంగళవారం (ఏప్రిల్ 21న) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

మంగళవారం 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..రాష్ట్రంలో ఓవైపు ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని.. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఏపీలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం నాడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాలులు వీస్తాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం నాడు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 15 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ప్రజలు నీళ్లు, పళ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి లాంటివి తీసుకోవవడం మంచిదని సూచించారు

మన్యం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు..సోమవారం (ఏప్రిల్ 20న) పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2°C,కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని, మిట్ట మధ్యాహ్నం వేళ అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం మంచిదని సూచించారు. 

వేసవికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలివేసవికాలంలో తీవ్రమైన ఎండలు, వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ మీరు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగాలి. దాహం వేయకపోయినా అప్పుడప్పుడు కచ్చితంగా నీళ్లు, మజ్జిగ లాంటివి తాగుతూ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. వెంట గొడుగు తీసుకెళ్లాలి లేదా టోపీ వాడాలి. నూనె వస్తువులు, మసాలా ఆహారానికి ఈ సమ్మర్ సీజన్లో దూరంగా ఉండటం మంచిది. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరదోసకాయ వంటివి మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.