Fire breaks out at Pachpadra Refinery in Rajasthan: రాజస్థాన్‌లోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రిఫైనరీని జాతికి అంకితం చేయాల్సి ఉంది. ప్రధాని పర్యటనకు కేవలం 24 గంటల ముందు ఈ ప్రమాదం జరగడం అధికార యంత్రాంగంలో తీవ్ర కలకలం రేపింది.
బలోత్రా జిల్లాలోని ఈ హెచ్‌పిసిఎల్ (HPCL) రిఫైనరీలో ప్రధాన విభాగమైన సిడియు-విడియు (CDU-VDU) యూనిట్‌లో ఎక్స్ఛేంజర్ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం . ప్రమాదం జరిగిన వెంటనే ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగలు అలముకున్నాయి. ఈ యూనిట్‌నే ప్రధాని మోదీ రేపు ప్రారంభించాల్సి ఉంది. అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే దాదాపు 20కి పైగా ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నాయి.
ప్రమాదం జరిగిన సమయంలో రిఫైనరీ ప్రాంగణంలో ఉన్న ఉద్యోగులను భద్రతా సిబ్బంది వెంటనే ఖాళీ చేయించారు. ప్రస్తుతానికి ప్రాణనష్టం జరిగినట్లు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. అగ్నిమాపక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, ఈ సాయంత్రం 4 గంటలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇక్కడికి రావాల్సి ఉంది.
భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌గా దీనిని రూ. 79,450 కోట్ల వ్యయంతో నిర్మించారు. దేశ ఇంధన భద్రతలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదం వల్ల రేపటి ప్రధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏవైనా మార్పులు ఉంటాయా లేదా అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
అగ్నిప్రమాద తీవ్రతను అంచనా వేసిన తర్వాతే నష్టం వివరాలు తెలుస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రిఫైనరీ అంతటా హై అలర్ట్ ప్రకటించి, అదనపు భద్రతా బలగాలను మోహరించారు. పర్యటనకు ముందు జరిగిన ఈ ఘటనపై ఇంటెలిజెన్స్, ఉన్నతాధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు.
