Hari Rama Jogaiah wrote a letter to Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రోజుకో లేఖ రాస్తూ హడావుడి చేస్తున్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ప్రకటించుకున్న సీనియర్ రాజకీయ నేత హరిరామ జోగయ్య. తాజాగా ఆయన జనసేన పార్లమెంటు అభ్యర్థుల పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. ఏడు పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను సూచించారు. ఈ మేరకు పోటీ చేయించేందుకు ఆలోచించాలని పవన్ కల్యాణ్‌ను హరిరామ జోగయ్య కోరారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేటల నుంచి అభ్యర్థులను నిలపాలని పేర్లను కూడా సిఫారసు చేశారు. వీరంతా కాపు వర్గానికి చెందిన అభ్యర్థులే. జనసేన పార్టీని పూర్తిగా కాపులకే పరిమితం అన్నట్లుాగ జోగయ్య ఇటీవల లేఖలు రాస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయిన తాము ఒక్క కులానికే పరిమితం అని చెప్పుకోదు. అందరూ ఓట్లేస్తేనే గెలుస్తారు. అయితే సీనియర్ రాజకీయ నేత అయిన జోగయ్య.. జనసేన పార్టీ పూర్తిగా కాపు కులానికి చెందినదే అన్నట్లుగా లేఖలు రాస్తూ వస్తున్నారు. ఆయన లేఖల వల్ల జనసేన పార్టీ ఇబ్బంది పడుతోంది. ఆ లేఖలను ఆసరాగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా సైనికులు విమర్శలు చేస్తున్నారు.
నిజానికి ఏపీలో టీడీపీ-జనసేన తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంపై చంద్రబాబు-పవన్ కల్యాణ్ పలుసార్లు చర్చలు జరిపారు. అభ్యర్థుల విషయంపై పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య ఇంతకు ముందు కూడా పలుసార్లు లేఖలు రాశారు. జనసేన పార్టీ చాలా నియోజక వర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తోంది. బీజేపీతో పొత్తు అంశం కొలిక్కి వచ్చాక టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించనుంది.
పొత్తులపై.. ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలని పవన్ కల్యాణఅ పదే పదే పార్టీ నేతలను కోరుతున్నారు. అయితే హరిరామ జోగయ్య జనసేన పార్టీ నేత కాదు. కాపు సంక్షేమ సేన తరపున మాత్రమే లేఖలు రాస్తున్నారు. ఆయనను ఎవరూ ఆపలేకపోతున్నారు. తాజాగా ఆయన ఎంపీ అభ్యర్థులను సైతం సిఫారసు చేయడంతో.. హరిరామజోగయ్య మరీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని జనసైనికులు అసహనంతో ఉన్నారు.