అన్నదాతలు మళ్ళీ రోడ్డెక్కారు. హంద్రీనీవా(Handrineva ) నీటిని నమ్ముకొని సాగు చేస్తున్న రైతులు ఆందోళనబాటపట్టారు. ఆ నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉరవకొండ(Uravakonda) నియోజకవర్గంలో రైతలు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్దం కూడా మొదలైంది. రైతులు రోడ్డెక్కడంతో లోకల్ అధికారులు కూడా కదిలారు. కానీ సాగునీటి శాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
హంద్రీనీవా కెనాల్ వెంబడి రైతుల పెద్ద ఎత్తున వేరుశనగతోపాటు, శనగ ఇతర పంటలు సాగు చేశారు. గత సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా మే వరకు నీరు వస్తుందనుకొని పంటలు సాగు చేశారు. కానీ ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడేయడంతో మల్యాల వద్ద పంపులకు నీరు రావడంలేదు. హంద్రీనీవా కెనాల్ కు నీటిని ఎత్తిపోయడం కుదరలేదు. హంద్రీనీవా నీటిని ఆపేశారు అధికారులు.
నీళ్లను అధికారులు ఆపేయడంతో హంద్రీనీవా కెనాల్ కింద పంటలు సాగు చేసిన రైతలు పరిస్థితి అందోళనకరంగా మారింది. ఈ అంశంపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గత వారం రోజులుగా రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మోపిడి వద్ద తుంగభద్ర నుంచి వస్తున్న హెచ్ఎల్సీ జలాలను హంద్రీనీవా కెనాల్ కు డైవర్ట్ చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు రైతులు, ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్.
ఇదే సమస్యపై పయ్యావుల కేశవ్(Payyavula Kesav) నీటిని ఏవిదంగా డైవర్ట్ చేయవచ్చో చేసిచూపించారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. నీటి పారుదల శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డితో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు. గత వారం రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే జిల్లా శాఖ అదికారులు మాత్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో మాట్లాడారు. వెంటనే హంద్రీనీవాకు హెచ్ఎల్షీ వాటర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయంపై స్పందించారు. నీటిని డైవర్ట్ చేయవచ్చో లేదో చూడాలంటూ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశం రగులుతున్న వేళ ఇంకా సమస్యను జటిలంగా మార్చకుండా పరిష్కరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్‌ఎల్‌సీ నుంచి తుంగభద్ర జలాలను డైవర్ట్ చేస్తే అనంతపురానికి తాగునీటి సమస్య తలెత్తే అవకాశాలున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరీ సమస్యను ఏవిధంగా అధికారులు పరిష్కరిస్తారో చూడాలి. ఇప్పటికే ఈ ఇష్యూ రాజకీయంగా టర్న్ తీసుకున్న వేళ అధికారులు తీసుకొనే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.