GVL Narasimha Rao Comments: ప్రజా సమక్షంలో వైసీపీ విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందని జీవీఎల్ నరసహింరావు తెలిపారు. వినాయక చవితి పండుగకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఆంక్షలు పెడుతున్నారన్నారు. ఇతర పండుగలకు లేని ఆంక్షలు హిందువులు పండుగలకు ఎందుకు అని ప్రశ్నించారు. క్రిస్మస్ వస్తుంటే ఎందుకు ఇలాంటి నిబంధనలు ఉండవని అడిగారు. వేల మంది ఒకేసారి సమూహంగా వచ్చినా మీకు పట్టదంటూ ఆయన కామెంట్లు చేశారు. పోలీసు స్టేషన్ లో కూడా క్రిస్మస్ పండుగలు చేయించారని జీవీఎల్ నరసింహ రావు గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం లెంపలు వేసుకుని ఆంక్షలు ఎత్తేయాలని అన్నారు. మైనారిటీ లు, క్రైస్తవులను భుజాన ఎక్కించుకుంటారా అని ప్రశ్నించారు. హిందువులకు ఆంక్షల పేరుతో అడ్డంకులు పెడతారా అని అడిగారు. హిందూ పండుగలను టార్గెట్ చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని పండుగలకు ఒకే తరహా నిబంధనలు, ఆంక్షలు ఎందుకు పెట్టడం లేదని అన్నారు.
జగన్ ప్రజా కంఠక పాలనను వివరిస్తాం...
వినాయక చవితికి పెట్టిన నిబంధనలు ఎవరూ పాటించవద్దని జీవీఎల్ నరసింహ రావు సూచించారు. సెప్టెంబరు 17న తేదీన ప్రధాని మోదీ పుట్టిన రోజని గుర్తు చేశారు. మోడీ మళ్లీ 400 సీట్లతో గెలుస్తారనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. ఏపీలో మూడున్నరేళ్లలో జగన్ ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. మోడీ ప్రజా పాలన, జగన్ ప్రజా కంఠక పాలనను ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తామన్నారు. సెప్టెంబరు 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సెప్టెంబరు 25వ తేదీన దీన్ దయాళ్ జయంతి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ అక్టోబర్ ఐదు వరకు కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీజేపీ సొంతంగా తన శక్తి పెంచుకుంటుందన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతుందన్నారు. వీధి వీధిన బీజేపీ పేరుతో ప్రజల్లోకి వెళతామన్నారు.
ఫిబ్రవరిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ..
బీజేపీతో పొత్తులు ముడి పెడుతూ ఎవరో ఏదో రాస్తే మేము పట్టించుకోమని జీవీఎల్ నరసింహ రావు అన్నారు. మోడీ అన్ని వర్గాల వారికి అవసరమైన సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు బీజేపీపై అనవసరంగా బురద జల్లుతున్నాయన్నారు. మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి మోది ఏపీకి చేసిన సాయంతో పాటు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు చేసిన మోసాలను వివరిస్తామన్నారు. ఫిబ్రవరిలొ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఈ విషయాలపైనే నేడు జరిగిన సమావేశంలో కార్యాచరణ పై చర్చించామన్నారు. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ సిద్దమవుతుందన్నారు. బీజేపీతో పొత్తు లేకపోతే భవిష్యత్తు లేదని ఆ పార్టీలు భావిస్తున్నాయన్నారు. మేము మాత్రం స్పష్టమైన విధానంతో సొంతంగా ఎదిగేలా ముందుకు వెళతామని జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ అంశాలపై మీడియాకి, ఇతర పార్టీలకి గందరగోళం ఉందేమో అన్నారు. వినాయకుని ఆశీస్సులతో బీజేపీకి ప్రజా దీవెన ఉంటుందని ఆశిస్తున్నట్లు వివరించారు.
175 నియోజక వర్గాల్లో పోరాట కార్యక్రమాలు..
175 స్థానాలలో బీజేపీ సొంతంగా బలపడాలని మా అధిష్టానం ఆదేశించిందన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ మేము రూపొందిస్తున్నామన్నారు. ఎవరో ఏదో రాశారని, అన్నారని మేము స్పందించమని తెలిపారు. అమిత్ షా చేసిన దిశానిర్దేశం ప్రకారం పని చేసి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్నారు. జలం కోసం జన యాత్ర కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. మా పోరాటం వల్ల అనేక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారన్నారు. రాయలసీమ, పల్నాడులో కూడా ఈ తరహా యాత్ర చేపడతామని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామన్నారు. 175 నియోజక వర్గాలలో పోరాట కార్యక్రమం చేస్తామని వివరించారు. ఆ తరువాత ఈ యాత్రలపై కార్యాచరణ సిద్దం చేస్తామని పేర్కొన్నారు. జనసేన మా మిత్ర పక్షమేనన్న జీవీఎల్.. మా పార్టీ పరంగా మేము బలం పెంచుకుంటున్నామన్నారు. అమరావతి ఏకైక రాజధాని అనేది బీజేపీ విధానం అన్నారు. రైతులకు అండగా ఉంటాం.. అవసరమైన సమయాలలొ మద్దతు గా పాల్గొంటామన్నారు. మా పార్టీ గురించి ఆత్రంగా ఎదురు చూసే మంత్రులు, మాజి మంత్రులు మా పార్టీ కండువా కప్పుకోవాలన్నారు. అప్పుడు మా కార్యాచరణ మొత్తం వారికి వివరిస్తామని తెలిపారు.