Andhra Pradesh Floods Donation:  విజయవాడ: ఏపీలో వరద బాధితుల సహాయార్ధం పలువురు ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇస్తున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా తోచినంత సహాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీకే గ్రూప్ వైస్ ప్రెసిడెంట్  జీవీ సంజయ్ రెడ్డి వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేయగా, పెద్ద మనసుతో సహాయం చేసిన వారిని అభినందించారు.


వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం


అమరావతి: ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ భారీ విరాళం ప్రకటించింది. హైదరాబాదులో ఆదివారం నాడు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు దివీస్ సిఈఓ దివి కిరణ్. సెప్టెంబర్ 1 నుంచి 8వ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ కు మరో రూ. 4.8 కోట్లను దివీస్ సంస్థ ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం రెండు దఫాలుగా కలిపి 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. పెద్ద మనసుతో భారీ సాయం చేసిన దివీస్ సంస్థను ఏపీ మంత్రి నారా లోకేష్ అభినందించారు. 


విజయవాడ వరద బాధితుల కోసం కాంటినెంటల్ కాఫీ తరపున ఎండి శ్రీ చల్లా శ్రీశాంత్ రూ.1 కోటి 11 లక్షలు, చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరపున శ్రీమతి చల్లా అజిత రూ.1 కోటి విరాళంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు నేడు అందచేశారు.


కోటి రూపాయల చొప్పున విరాళాలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి లారస్ ల్యాబ్స్ ఫౌండర్ & సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, నాగరాణి చావ రూ.1 కోటి విరాళం ఇచ్చారు. సీఎం చంద్రబాబును కలిసి చెక్కును నేడు అందచేశారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యం వరద బాధితుల సహాయార్ధం రూ.1 కోటి 50 లక్షల విరాళం ఇచ్చారు. ఆదివారం సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందజేశారు. ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్ వేములపల్లి విజయవాడ వరద బాధితుల సహాయార్ధం సీఎం చంద్రబాబును కలిసి రూ.1 కోటి విరాళాన్ని అందచేశారు.


వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి (AP CMRF)కి చలసాని చాముండేశ్వరి, శ్రీమన్ రూ.25 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు నేడు అందచేశారు.