వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని... ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ మరో పక్క అభివృద్ధి బాటలో నిలిపేలా పటిష్ఠ ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు దూసుకువెళ్తుందని అన్నారు.  


అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఏపీ 


2021-22లో ఏపీ 11.43శాతం  జి.ఎస్.డి.పితో  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఉందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. దేశ జి.డి.పి 8.7 నమోదవ్వగా ఏపీ జి.ఎస్.డి.పి కేంద్రం జీడీపీ కన్నా 2.73 శాతం ఎక్కువని తెలిపారు. కోవిడ్ 19 సమయంలో భారత దేశ వృద్ధిరేటు - 6.60 శాతం నమోదైన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం 0.08 శాతం వృద్ధిని  నమోదు చేసిందని, రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా 38.5 శాతం ఎక్కువని, దేశంలోనే ఏపీ తలసరి ఆదాయంలో 6వ స్థానంలో ఉందని  అన్నారు. చంద్రబాబు పాలనలో 2018-19లో 5.36 శాతం వృద్ధిరేటు ఉంటే.. ప్రస్తుతం సీఎం జగన పాలనలో 2021-22 నాటికి 11.43 శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న వృద్ధిరేటు దీనికి సూచిక అన్నారు.   రాష్ట్రం పురోగతిలో ఉందో తిరోగమనంలో ఉందో ఈ వృద్ధిరేటు ఆధారంగా తెలియడం లేదా అని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. 


రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు 


డీపీఐఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ)  నివేదిక ప్రకారం, 2022 జూలై చివరి నాటికి భారతదేశ వ్యాప్తంగా 1,71,285 కోట్ల పెట్టుబడులు రాగా అందులో ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీపడి రూ.40,361 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామన్నారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, పెట్టుబడులను రాబట్టడంలో AP 5వ స్థానంలో ఉందని, పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చెయ్యడంలో 3వ స్థానంలో ఉందని డొక్కా తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీ ఈ రెండింటిలోనూ.. మొదటి స్థానంలో ఉందని అలాగే జూన్ 2022లో టైర్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే మొదటి ఐదు కంపెనీలలో ఒకటైన ఏటీసీ అలయన్స్ టైర్స్ రూ. 1,240 కోట్లతో విశాఖపట్నంలో ప్లాంట్ కోసం పెట్టుబడి పెట్టిందని 'సైబరాబాద్' ను క్రెడిట్‌ కోసం నేనే నిర్మించానని చెప్పుకొని పబ్బం గడుపుకొనే చంద్రబాబుకు... 40 ఏళ్ల అనుభవానికి సాధ్యం కాని అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలో చేసి చూపారన్నారు.  


ఈజ్ ఆప్ డూయింగ్ లో 


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా 4 సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడంలో దేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం లభించడం గర్వకారణమన్నారు. ఈ తరం యువతకు అవకాశాలు సృష్టించి రాబోయే తరం వారికి మార్గం సుగుమం చేస్తున్నామని తెలిపారు. రైతులు మోసపోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు.70 కంటే ఎక్కువ అర్బన్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటయ్యాయని, ఇప్పటికే ఉన్న 32 క్లినిక్లు మరింత అభివృద్ధి చెందాయని చెప్పారు. 


రూ.1154 కోట్ల బడ్జెట్ 


గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 49.91 కిలోమీటర్ల మేర విస్తరించిన పేరేచర్ల-కొండమోడు రహదారి రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ డొక్కా చెప్పారు.  గత వారంలో గుంటూరు జిల్లా పరిషత్ రూ1,154.47 కోట్ల బడ్జెట్ ను ఆమోదించిందని, పచ్చని, ఆరోగ్యవంతమైన గుంటూరును సాధించే లక్ష్యంతో, జీఎంసీ గుంటూరు నగరంలో స్థానిక పార్కులను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. గాంధీ పార్కులో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2025 నాటికి ప్రసిద్ధ గుంటూరు సన్నం మిర్చి ఎగుమతులను రూ. 4,661 కోట్లకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎగుమతి కార్యాచరణ ప్రణాళికను పంపిందని చెప్పారు. గ్రాఫిక్స్ మాత్రమే సృష్టించి నిజమైన అభివృద్ధిని విస్మరించిన టీడీపీ ప్రభుత్వంలా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, డొక్కా మాణిక్య ప్రసాద్ వ్యాఖ్యానించారు.కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన సందర్భంగా సజ్జన్ జిందాల్ పేర్కొన్న మాటలు అక్షర సత్యాలని నిరూపించేలా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు.