YSRCP MLA Annabathuni Siva Kumar: తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై పోలీస్ కేసు నమోదైంది. పోలింగ్ రోజు బూత్ లోనే ఆయన ఓ ఓటరుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎమ్మెల్యే సహా మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. తనపై ఎమ్మెల్యే కాకుండా మరో ఆరుగురు దాడి చేశారని బాధితుడైన గొట్టిముక్కల సుధాకర్ తన ఫిర్యాదులో వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం
పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓ ఓటరుపై చేయి చేసుకోవడం.. తిరిగి ఆయన ఎమ్మెల్యే చెళ్లు మనిపించిన ఘటన మే 13న సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల వేళ వందల సంఖ్యలో ఉద్రిక్తతలు, ఘర్షణలు, పదుల సంఖ్యలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా.. ఈ ఘటన మాత్రం బాగా హైలెట్ అయింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ పోలింగ్ బూత్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. తన ఫ్యామిలీతో కలిసి ఉదయం 11 గంటల సమయంలో వచ్చారు.
అయితే, అందరితో పాటు క్యూలైన్ లో నిలబడకుండా నేరుగా బూత్ లోకి వెళ్లి ఓటు వేశారు. తన ఫ్యామిలీని కూడా వెంట తీసుకెళ్లి ఓటు వేశారు. అప్పటికే దాదాపు గంటలతరబడి క్యూలైన్ లో ఉన్న ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. కానీ, వారిలో గొట్టుముక్కల సుధాకర్ అనే ఓటరు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. క్యూలో నిలబడి ఉన్నవారంతా ఓటు వేయడానికి వచ్చినవారే మీరెందుకు నేరుగా వెళ్లి ఓటు వేశారు.. అంటూ మాట్లాడారు. ఈ మాటలను ఓటు వేసి బయటికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆయన అనుచరులు చెప్పారు.
నువ్వెవరివి రా చెప్పడానికి అంటూ ఎమ్మెల్యే శివకుమార్ దౌర్జన్యంగా ఓటరు సుధాకర్ చెంపపై కొట్టారు. ఆ పరిస్థితిలో తన ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకున్న ఓటరు సుధాకర్ అదే ఊపులో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై లాగి ఒక్కటి కొట్టారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబ సభ్యులు వెంటనే సుధాకర్‌పై దాడిచేసి విచక్షణారహితంగా పిడిగుద్దులు కొట్టారు. కాళ్లు, చేతులతో ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ దాడి చేశారు. బాధితుడి అరుపులు విన్న పోలీసులు వారిని అతి కష్టం మీద ఆపగలిగారు. పోలీసు వ్యాన్‌లో బాధితుడ్ని తరలించారు. వ్యాన్ వద్దకు తీసుకువెళ్తున్న సమయంలోనూ పోలీసుల సమక్షంలోనే సుధాకర్‌ను ఎమ్మెల్యే అనుచరులు కొడుతూనే ఉన్నారు.