Jail sentence for Guntur Municipal Commissioner :   గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు నెల రోజుల జైలు శిక్ష విధించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచింది.. వచ్చే నెల జనవర 2వ తేదీ 2023న హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.. గుంటూరు కొత్తపేటలో యడవల్లివారి సత్రం లీజు చెల్లింపులో హైకోర్టు ఆదేశాలు పాటించక పోవటంతో.. కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు. గుంటూరు ( Guntur) కార్పొరేషన్ పరిధిలోని యడవల్లి  వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్‌లకు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.               


అయితే ఆ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్‌ (Guntur Municipal Commissioner) అమలు చేయలేదు. దీంతో  కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్‌ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మున్సిపల్ కమిషనర్‌ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద లొంగిపోవాలని ఆమెను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.                                                             


ఏపీ అధికారులు ఇటీవల వరుసగా కోర్టు ధిక్కరణ కేసులో శిక్షలకు గురవుతున్నారు. కొద్ది రోజుల కిందటే  ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . శ్యామలరావు, భాస్కర్లకు నెల రోజుల జైలుశిక్ష ,వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది . ఎయిడెడ్ నియామకం అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని పిటీషనర్లు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలుచేయలేదని హైకోర్టు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. వీరిద్దరూ డివిజనల్ బెంచ్ కు వెళ్లడంలో.. తీర్పు అమలు వాయిదా వేశారు.                


 గత మూడేళ్ల కాలంలో   సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు, మున్సిపల్‌ కమిషనర్లకు.. వివిధ కేసుల్లో కోర్టు ధిక్కరణకు పాల్పడితే.. హైకోర్టు జైలు శిక్షలు విధించిన విషయం విదితమే. ఇదే సమయంలో.. వారు హైకోర్టు ముందు హాజరై.. తమ తప్పును ఒప్పుకోవడంతో.. జైలు శిక్ష కాకుండా.. సాధాణ శిక్షలు అమలు చేసిన సందర్భాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న కీర్తి చేకూరి కూడా శిక్షతో పాటు జరిమానా విధించింది.