Ganta Srinivasa Rao : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం వచ్చిన తాను కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిశానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ రాజధాని వద్దని ప్రజలే తీర్పు చెప్పారని గంటా అన్నారు. వైసీపీ నేతలే ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అన్నారని గుర్తుచేశారు. ఎన్నికల్లో రకరకాల ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు విజ్ఞతతో టీడీపీ అభ్యర్థి చిరంజీవిని గెలిపించారన్నారు. కేవలం నెల రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించినా టీడీపీని గెలిపించారని తెలిపారు. అమరావతికి, టీడీపీకి అనుకూలంగా ప్రజల తీర్పు ఇచ్చారన్నారు. జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారన్న గంటా.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విశ్లేషించినా ఈ విషయం అర్థమవుతోందన్నారు. 


మంత్రి హెచ్చరించిన ఓట్లు టీడీపీకే 


"గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమం ఉంటే వచ్చాను. ఇక్కడకు వచ్చినప్పుడు నాకు ఆప్తులు కన్నా లక్ష్మీనారాయణ, పుల్లారావును కలుస్తుంటాను. విశాఖలో రాజధాని అని వైసీపీ చెబుతోంది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే రెఫరాండం అన్నారు. ఇది వైసీపీ నేతలే చెప్పారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రాజధానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజల మద్దతు టీడీపీకి ఉంది కాబట్టి మా అభ్యర్థి గెలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందు నుంచి వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడింది. గ్రాడ్యుయేట్స్ కాని వాళ్లకు కూడా ఓట్లు రిజిస్టర్ చేయించి దొంగ ఓట్లు వేశారు. చాలా ప్రలోభాలకు గురిచేశారు. ఓ మంత్రి అయితే పట్టభద్రులను బెదిరించారు. ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని పట్టభద్రులను హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ప్రజలు టీడీపీ వైపు నిలిచారు. కేవలం ఒక నెల ముందే టీడీపీ అభ్యర్థిని ఖరారు చేశాం." -గంటా శ్రీనివాసరావు 


పవన్ మాట అదే 


"ఎన్నికల ముందు పొత్తులపై స్పష్టత వస్తుంది. అయితే ప్రజల అభిప్రాయం మాత్రం.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలని ఉంది. జనసేన, టీడీపీ ఒక ఫ్లాట్ ఫామ్ వస్తే బాగుంటుందని ప్రజల్లో ఉంది. అదే మాట పవన్ కల్యాణ్  చెబుతున్నారు. 2019లో 50 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చిన వైసీపీకి మొన్న కేవలం 30 శాతం వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాదాపుగా 70 శాతం ఉంది. ఈ ఓట్ల శాతం చీలకపోతే టీడీపీ ప్రభుత్వం రాబోతుంది." - గంటా శ్రీనివాసరావు 


సీఎం జగన్ లో ఓటమి భయం 


"నిన్న తెనాలిలో టీడీపీ కౌన్సిలర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జనాల్లో ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే సీఎం జగన్ .. తన పార్టీ వాళ్లను రెచ్చగొట్టి ప్రతిపక్షపార్టీల నేతలపై దాడులకు పాల్పడేలా చేస్తున్నారు. ఇవాళ పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఓడిపోతున్నామనే భయం జగన్ లో స్పష్టం కనిపిస్తుంది. మీ నాయకుడి మాట విని దాడులకు పాల్పడితే మీరు రేపు ఇబ్బంది పడతారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాడులకు పాల్పడిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు రాజధానులకు వ్యతిరేకం అని రుజువైంది. "- మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు