Mla Balakrishna : ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

ABP Desam   |  Satyaprasad Bandaru   |  28 May 2022 04:34 PM (IST)

Mla Balakrishna : వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగేస్తుందని విమర్శించారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ

Mla Balakrishna :  గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. గతానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏమిటో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఓటు సక్రమంగా వేస్తేనే గుడి, బడి ఉంటాయన్నారు. వైసీపీ ప్రభుత్వం గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగేస్తుందని ఆరోపించారు. తెలుగు జాతి చైతన్యానికి ఎన్టీఆర్ విశ్వరూపం అన్న బాలకృష్ణ, కలియుగ పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ శతజయంతిలో గౌరవ అధ్యక్షులుగా పిలవటం తనతో ప్రారంభించటం తన అదృష్టం అన్నారు. ఎన్టీఆర్ నిర్మించిన థియేటర్ లో కార్యక్రమాలు చెయ్యటం చాలా ఆనందం వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్ కు మరణం లేదు 

తెనాలిలో ఎంతో మంది గొప్ప నటీనటులు, రాజకీయ నాయకులు జన్మించారు. మతాలకు, కులాలకు అతీతంగా ఎన్టీఆర్ రాజకీయాలు చేశారు. నటనకు విశ్వరూపం చూపిన వ్యక్తి ఎన్టీఆర్. కారణ జన్ముడు ఎన్టీఆర్. రైతు కుటుంబంలో పుట్టి ప్రతి ఒక్క హృదయంలో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి.  తెలుగు జాతి ఎప్పుడు కష్టాల్లో ఉన్న ముందుకు వచ్చి నేను ఉన్నాను అన్న వ్యక్తి ఎన్టీఆర్. అన్ని కులాలను అధికార పీఠంపై కూర్చోపెట్టిన వ్యక్తి. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు తెలుగు జాతికి గొప్పదనం. సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో ముందుకు సాగిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన కన్న ఎక్కువ సినిమాలు నటించిన వ్యక్తులకు లేని గుర్తింపు గౌరవ ఎన్టీఆర్ కి దక్కింది. అంతటి లెజండ్ తన తండ్రి అనటం నాకు గర్వకారణం. రాజకీయాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు ఇళ్లు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి మరణం లేదు ప్రజల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. నా అభిమానులు నా నుంచి ఏమి ఆశించకుండా నా వెంట నడవటం పూర్వ జన్మ అదృష్టంగా భావిస్తున్నాను. నా అభిమానులు కులాలకు మతాలకు సంబంధం లేకుండా తమతో ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. విలువ మనిషికి కానీ తాను పుట్టిన కులానికి కాదు అని అందరు గుర్తు పెట్టుకోవాలి. తెలుగుదేశానికి ఉన్న బలమైన కార్యకర్తలు ఇంకా ఏపార్టీకి లేరన్నారు.  - బాలకృష్ణ, ఎమ్మెల్యే
 

రాజకీయాల్లో విప్లవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరపడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కూడు, గూడు, గుడ్డ, నినాదంతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. బాలకృష్ణ రావటం ఆయన చేతుల మీద కార్యక్రమం ప్రారంభించటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాజకీయాల్లో విప్లవం తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ మరింత ముందుకు వెళ్తామన్నారు. 

Published at: 28 May 2022 04:34 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.