Guntur Mirchi: మిర్చి రైతుల పంట పండుతోంది. మార్కెట్ లో మంచి ధర వస్తోంది. మిర్చికి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ధర చాలా తక్కువగా ఉండగా.. ఈసారి మాత్రం ధరలు నానాటికీ పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. 


మార్కెట్ మాయాజాలం


గతంలో ఎన్నడూ లేని విధంగా  ఏడాది మిర్చి ధర పెరగడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది మిర్చి పంట చేతికి రాకముందు ధరలు ఆకాశంలో ఉంటాయి. వాటిని చూసి రైతులు సంబరపడిపోతారు. ఈ యేడు రేట్లు బాగున్నాయని, మంచి దిగుబడి కూడా వస్తే కొంత లాభాలతో సంవత్సరం గడుస్తుందని ఆశిస్తారు. కానీ పంట కోత తర్వాత రైతుల ఆశలు గల్లంతు అవుతుంటాయి. ఆకాశంలో ఉన్న ధర అథఃపాతాళానికి పడిపోతుంది. మిర్చి కోతల తర్వాత వాటిని టిక్కీలుగా కట్టి గుంటూరు యార్డుకు తీసుకువచ్చిన తర్వాత ధర భారీగా పడిపోతుంది. దళారుల ధరల ఆటలో రైతుల ప్రతి ఏడాది చిత్తు అవుతూనే ఉంటుంటాడు.  మార్కెట్ మాయాజాలం రైతును బలి చేస్తూనే వస్తోంది. కానీ వ్యవసాయం వ్యాపారంగా కాకుండా జీవన విధానంగా చూసే రైతులు.. మరుసటి ఏడాదైనా మంచి ధర రాకపోదా అని పంటలు వేస్తూనే ఉంటారు.


గతేడాదికి భిన్నంగా రేట్లు..


ఈ ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంట చేతికి వచ్చిన నాటి నంచి ఇప్పటి వరకు ధర పెరిగిందే కాని తగ్గలేదు. ఇలా ధరలు తగ్గకపోవడంతో మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మిర్చి దిగుబడి చాలా పడిపోయింది. తెగులు సోకి చాలా మంది రైతులు పంట నష్టపోయారు. దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. 


క్వింటాలుకు ఎంత ధర?


ఈ ఏడాది మిర్చి క్వింటాల్ కు రూ.18 వేల ధర పలికింది. అక్కడి నుండి మిర్చి ధర పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో క్వింటా మిర్చికి రూ.32 వేలు ఇస్తుండటంతో రైతులు ఖుషీ అవుతున్నారు. ధరలు బాగుండటం పట్ల అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్వింటా మిర్చికి రూ.32 వేలు రావడం రికార్డు స్థాయి ధర మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది ఆల్ టైం రికార్డు అని వ్యాపారులు చెబుతున్నారు. 


ఈ ఏడాది తగ్గిన దిగుబడి..


గత ఏడాది మిర్ఛి పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ ఏడాది తక్కువ విస్తీర్ణం లో పంటను సాగు చేయడంతో మిర్చి ధరలు అమాంతం పెరిగాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ధరల పెరుగుదల ఈ ఏడాది మొత్తం కొనసాగుతుందని చెబుతున్నారు. ఆసియా లోనే అతి పద్ద మిర్చి యార్డ్ గా గుంటూరు మిర్చి యార్డ్ పేరు గాంచింది. గుంటూరు మిర్చి యార్డ్ కు ప్రతి రోజు 20 వేల నుంచి 40 వేల క్విటాళ్ల సరకు వస్తుంది. ప్రతి రోజు గుంటూరు యార్డ్ రైతులు, వ్యాపారులు,యార్డ్ కార్మికులతో పండగ వాతావరణం కనిపిస్తుంది. మిర్చి ధర స్థిరంగా పెరుగుతూ ఉండటంతో మార్కెట్ కళ కళ లాడుతోంది. 


మరింత పెరగనున్న ధర..


ప్రస్థుతం విదేశాలకు మిర్చి ఎగుమతులకు సంబంధించి బ్యాన్ ఉంది. ఎక్స్ పోర్టుకు కేంద్రం పర్మిషన్ ఇస్తే  మిర్చి ధరలు మరింతగా పెరిగి అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు భారీగా రైతుల వద్ద నుంచి మిర్చి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వలు చేస్తున్నట్లు తెలుస్తోంది.