Ippatam Issue : రాజకీయంగా సంచలనం రేపిన ఇప్పటం గ్రామం ఇంకా పోలీస్ ఆధీనంలోనే ఉంది. పోలీస్ పికెటింగ్ కొనసాగించడంతో ఇప్పటం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.  గ్రామంలో వైయస్సార్ విగ్రహాల వద్ద కంచెలు వేసి పోలీసులు రక్షణ ఏర్పాటుచేశారు. వైసీపీ ప్రభుత్వం చర్యలపై ఇప్పటం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటం గ్రామస్థులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటంలో జరిగిన ఘనటపై వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా బాధితులను పరామర్శించారని అన్నారు. జనసేన ఆవిర్భావ సభ మార్చి 14వ తేదీన జరిగింది. పవన్‌ కల్యాణ్‌ సభకు భూములు ఇచ్చామని, మార్చి 14వ తేదీనే నోటీసులు ఇచ్చారని గ్రామస్థులు తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీన వైసీపీ సోషల్ మీడియాలో ఈ విషయం హల్ చల్ చేసిందన్నారు. గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వినతిపత్రం ఇచ్చామన్నారు. వైసీపీ నేతలు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చేశారని, పవన్‌ కల్యాణ్‌  24 గంటల్లో స్పందించి  గ్రామానికి వచ్చారన్నారు. బాధిత కుటుంబాలను  పవన్‌ పరామర్శించారని, వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా పవన్‌ కల్యాణ్‌ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గ్రామానికి 50 లక్షలు ఇవ్వాలని స్థానిక నాయకులు మాట్లాడుతున్నారని, వైసీపీ నాయకులు  గ్రామంలో పంచాయతీని లేకుండా చేశారని ఆరోపించారు. పంచాయతీలకు సీఎం జగన్ నిధులు ఇవ్వడంలేదని నిలదీశారు.


రైతులు లేరని వైసీపీ నేతలు ఎలా అంటారు? 


జనసేన ఆవిర్భావ సభకు 31 మంది రైతులు భూములిచ్చారని, వారిలో 10 మంది ఇళ్లను వైసీపీ నాయకులు పగలకొట్టారని గ్రామస్థులు ఆరోపించారు.  పగలకొట్టిన ఇళ్లల్లో రైతులు లేరని చెబుతున్నారని, ఇళ్లు పగలకొట్టుకోవచ్చని 70 నుంచి 80 శాతం మంది సంతకాలు పెట్టారని చెబుతున్నారని, నిజంగా అంతమంది సంతకాలు పెడితే ఆందోళన ఎందుకు చేస్తారని గ్రామస్థులు నిలదీశారు. ప్రతిపక్షాలు అన్నీ ఇక్కడ గ్రామస్థులను పరామర్శిస్తుంటే వైసీపీ నాయకులు ప్రతిపక్షనేతలను తిట్టడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు.  స్థానిక వైసీపీ నేతలు 60 అడుగులకు రోడ్డును విస్థీర్ణం చేసేందుకే ఇళ్లులు కూల్చారని చెబుతున్నారని, మంత్రులు గ్రామంలోకి రాకుండా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. 


మాపై కక్షసాధింపులు ఆపండి 


జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు.. ఇళ్లు కూల్చివేస్తారా? అని ఇప్పటం గ్రామస్థులు ప్రశ్నించారు.  కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ ఇళ్లను కూల్చివేశారని  ఇప్పటం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు ఇళ్లు కూల్చివేస్తారా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ గ్రామంలో 600 కుటుంబాలు ఉన్నాయని దాదాపు 2 వేల జనాభా ఉందని చెప్పారు. ఎక్కువ మంది జనసేన మద్దతుదారులు కావటంతో రోడ్ల విస్తరణ పేరిట ఇళ్ల కూల్చివేత చేపట్టారని  గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సభకు స్థలం ఇచ్చాకే తమకు నోటీసులు అందాయన్నారు. ఇందుకు సంబంధించిన నోటీసులను వారు విలేకరులకు చూపారు.  వైసీపీ నాయకులు తమ గ్రామస్థులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమపై వేధింపులు ఆపాల్సిందిగా సూచించారు.