Gudivada Politics: గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వేసిన నామినేషన్ విషయంలో ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. ఆయన వేసిన నామినేషన్ ప్రస్తుతానికి ఆమోదం పొందినపప్పటికీ ఎన్నికల సంఘం ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. అందుకు కారణం కొడాలి నాని తన నామినేషన్ పూర్తి వివరాలను వెల్లడించలేదని అంటున్నారు. నాని సమర్పించిన నామినేషన్‌ డాక్యుమెంట్లలో తారె ప్రభుత్వ వసతిని ఉపయోగించుకోలేదని చెప్పుకున్నారు. కానీ, ఆ విషయం బయట పడింది. గుడివాడలోని పాత పురపాలక కార్యాలయ భవనాన్ని ఐదేళ్లు పూర్తిగా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఖాళీ చేసిన ఆయన నామినేషన్‌ పత్రంలో మాత్రం తాను అసలు ప్రభుత్వ వసతి భవనాన్ని ఉపయోగించుకోలేదని చెప్పారు. 


కానీ, అసలు విషయాన్ని టీడీపీ నేతలు బయటపెట్టారు. మీడియా కూడా దీనిపై ఫోకస్ చేసింది. దీంతో రిటర్నింగ్‌ ఆఫీసర్ నోటీసులు జారీచేశారు. చివరికి పాత మున్సిపల్‌ కార్యాలయ భవనాన్ని తాను వసతిగా వాడుకోలేదని.. తన ఆఫీసుగా మాత్రమే వినియోగించుకున్నట్లుగా చెప్పారు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన అద్దెను పూర్తి స్థాయిలో చెల్లించానని నోటీసుకు బదులు ఇచ్చారు. పాత మున్సిపల్‌ ఆఫీసును లీజుకు తీసుకుని అద్దె చెల్లించినట్టు కొడాలి నాని పత్రాలు సృష్టించారని చెబుతున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి ఆ పత్రాలను తీసుకున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాను బకాయి లేకపోవడం వల్లే.. అఫిడవిట్‌లో దాన్ని పొందుపరచలేదని నోటీసులకు వివరణ ఇచ్చినట్టు తెలిసింది.


టీడీపీ నేతలైన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసిబాబు, హైకోర్టు అడ్వకేట్ అరవింద్‌ కలిసి గుడివాడలోని రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసుకు వెళ్లి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. తమ అభ్యంతరాలను ఆధారాలతో ఆర్వోకు సమర్పించారు. పాత మున్సిపల్‌ కార్యాలయాన్ని గత ఐదేళ్లుగా నాని వాడుకున్నారని చూపుతూ ఆధారాలను కూడా సమర్పించారు. నాని నామినేషన్‌ అఫిడవిట్‌లోని 17వ పేజీలో ప్రభుత్వ అకామడేషన్‌ను వాడుకోలేదంటూ నో అని పెట్టిన విషయాన్ని టీడీపీ నేతలు ప్రస్తావించారు. ఐదేళ్లు ప్రభుత్వ బిల్డింగును కొడాలి నాని వాడుకున్నారని మున్సిపల్‌ కమిషనర్‌ ధ్రువీకరించిన పత్రాలనూ టీడీపీ నేతలు అందజేశారు. దీని ఆధారంగా నానిని అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారుల స్పందనను బట్టి తాము న్యాయపోరాటం చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు.