కరోనా ఆంధ్రప్రదేశ్ లో బీభత్సం సృష్టించింది. కరోనా బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయి ఆవేదనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఏపీ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు చేపడుతూనే ఉంది. ఇదే సమయంలో కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించనుంది. 


కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనుంది. రూ.50వేల రూపాయల పరిహారాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పరిహారం చెల్లింపు జరిపేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు జరగనుంది. మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని అధికారులకు సూచనలు జారీ అయ్యాయి. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ కేటాయిస్తారు. దరఖాస్తు తీసుకున్న 2 వారాల్లోగా పరిహారం సొమ్మును కుటుంబ సభ్యులకు అందజేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు.. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రొఫార్మాను కూడా రూపొందించింది.


వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. కొవిడ్ మృతుల కుటంబాలకు పరిహారానికి సంబంధించి.. మార్గదర్శకాలను జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ను జారీ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాల నుండి దరఖాస్తు తీసుకున్న రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తిచేయాలని ప్రభుత్వం తెలిపంది. దరఖాస్తు కోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా ను రూపొందించిన వైద్య ఆరోగ్య శాఖ అందులో అన్ని వివరాలను పొందుపరచాలని చెప్పింది.


ఇప్పటి వరకూ కరోనా మృతులు


రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 27,641 పరీక్షలు నిర్వహించగా.. 295 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి 7 మంది మృతి చెందారు. కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,350కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 560 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,44,692 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,830 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, చిత్తూరు, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.


Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?


Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి