Three Capitals Issue : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఓ వైపు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో పెట్టాలనుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అసెంబ్లీలో ఏం జరగబోతోందా అన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. మూడు రాజధానుల బిల్లు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న వాదన నిపుణుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఇప్పటికే రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు స్పష్టంగా తీర్పునివ్వడమే కాదు.. ఎలాంటి చట్టాలు చేసే చాన్స్ లేదని రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. ఇప్పుడు మూడు రాజధానులను ఏ రూపంలో అయినా చేపట్టి బిల్లు పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు దారి తీయవచ్చన్నవాదన ఉంది.
మూడు రాజధానుల బిల్లు పెట్టాలన్న పట్టుదలతో ఏపీ ప్రభుత్వం
అయితే ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలగా ఉందని కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే మూడు రాజధానుల బిల్లు అంశంపై ప్రభుత్వం ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వకపోయినా సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజే అంటే గురువారమే మూడు రాజధానుల అంశంపై లఘు చర్చనిర్వహించనున్నారు. మూడు రాజధానులు చేస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మూడు రాజధానుల ప్రజెంటేషన్ పై ఇప్పటికే నిపుణులతో కలిసి నివేదిక రూపొందించారని చెబుతున్నారు.
మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి
మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పే అవకాశం ఉంది. అయితే మూడు రాజధానులు చేయడం సాద్యం కాదని స్పష్టమైన తీర్పు హైకోర్టు ఇచ్చినప్పుడు.. ఆ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లి బలమైన వాదనలు వినిపించి.. స్టే తీసుకు రావడం లేదా.. కోర్టు తీర్పును కొట్టి వేయడం వంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం వైపు నుంచి అలాంటి ప్రయత్నాలేమీ జరగలేదు. ఇప్పుడు మూడు రాజధానుల వల్ల ఎంతో ఉపయోగం అని సీఎం జగన్ అసెంబ్లీలో పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ఇచ్చినా ఎలా చేస్తారన్న మౌలికమైన ప్రశ్న మాత్రం అందరిలోనూ వస్తుంది. దానికి సీఎం జగన్ స్వల్పకాలిక చర్చ తర్వాత సమాధానం చెబుతారని ఆశిస్తున్నారు.
వివాదాలతో రాజధాని బిల్లు పెడితే ఇబ్బందికరమే
హైకోర్టు తీర్పును ఉల్లంఘించి.. సీఆర్డీఏను ఇతర చట్టాలను ఉల్లంఘంచి రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల వివాదం అవుతుంది కానీ.. రాజధాని ఏర్పాటు కాదన్న అభిప్రాయం నిపుణుల్లో ఉంది. చట్ట పరంగా అందరి ఆమోదంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్లనే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇలా చేయాలంటే రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు మూడు రాజధానులు చేయాలనే పట్టుదలతో ఉంది .అయితే రైతులు న్యాయపోరాటం ద్వారా.. చాలా వరకూ న్యాయం తమ వైపే ఉందని నిరూపించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏ రూపంలో ముందుకెళ్తుందనేది గురువారం తేలిపోయే అవకాశం ఉంది