Employes Agitation: బకాయిలు తీర్చాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చేపట్టిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. గతంలో సీఎం జగన్(Jagan) ఇచ్చిన హామీలు సహా ఇంతకు ముందు ఆందోళన సమయంలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీలపై శుక్రవారం ఉద్యోగ సంఘాలతో చర్చించింది. వీటిపై లిఖిత పూర్వక హామీకి ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. అలాగే మద్యంతర భృతిపై కూడా ఎటూ తేల్చకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.
ఉద్యోగుల ఉద్యమం
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో గతంలో ఇచ్చిన హామీలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన ఉద్ధృతం చేశారు. సీపీఎస్(CPS) రద్దు సహా బకాయిలు చెల్లింపు, కొత్త పీఆర్సీ, ఐఆర్( I .R )ప్రకటన తదితర డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. అందులో భాగంగానే విడదల వారీగా నిరసనలు చేపట్టిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం స్పందించకుంటే మరోసారి ఛలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ నెల 27న చలో విజయవాడ (Vijayawada)కార్యక్రమం నిర్వహించి తీరుతామని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ముందు ఉద్యోగులతో ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం గ్రహించింది. అందుకే ఉద్యోగ సంఘాలను చర్చలకు అహ్వానించింది. సచివాలయంలో మంత్రుల కమిటీ ఉద్యోగులతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ముఖ్యంగా ఐఆర్ ప్రకటనపై ఉద్యోగులు పట్టుబట్టగా... ప్రభుత్వం మరోసారి దాటవేత ధోరణి అవలంభించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.
మంత్రులు బొత్స(Botsa) సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల( Sajjala)రామకృష్ణారెడ్డితో పాటు సీనియర్ అధికారులు చర్చలో పాల్గొన్నారు. అటు ఉద్యోగ సంఘాల నుంచి బండి శ్రీనివాసరావు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి సహా పలువురు ఉద్యోగ సంఘం నేతలు చర్చలో పాల్గొన్నారు.
చర్చలు విఫలం
ముఖ్యంగా పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలపైనే ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఎన్నికలు సమయం దగ్గరపడుతుండంతో మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగులు పట్టుబట్టగా...ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఉద్యోగం సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు, కొత్త పీఆర్సీ కొలువుదీరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటిలోగా ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు సర్దుబాటు చేయాలని ఉద్యోగులు కోరారు. గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఉద్యోగుల ఉద్యమంతో.. పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు, డీఏలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటిని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో మరోసారి ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఎన్నికల ముందు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే..ఈనెల 27న చలో విజయవాడ నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీంతో మరోసారి ఉద్యోగ సంఘ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు సైతం కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.