Godavari Floods : పోలవరం వద్ద వరద ఉద్ధృతిని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అనంతరం వరద పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యుహంగా గోదావరిలో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోందన్నారు. తమకు వచ్చిన సమాచారం ప్రకారం ఎగువ నుంచి 7 , 8 లక్షల కూసెక్కుల వరద వచ్చిందన్నారు. 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందన్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. లోయర్ కాపర్ డ్యామ్ ని సేఫ్ సైడ్ లో చేయలేకపోయామన్నారు. లోయర్ కాపర్ డ్యామ్ నుంచి వరద నీరు ప్రాజెక్టులో పనులు చేస్తున్న ప్రాంతాన్ని ముంచెత్తిందని తెలిపారు. ఎగువ కాపర్ డ్యామ్ నుంచి వరద నీరు రావడం వల్ల డయాఫ్రం వాల్ చాలా చోట్ల దెబ్బ తిందన్నారు.
పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు పోలవరం ప్రాజెక్టులో వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు స్పీల్ వేలో48 రేడియల్ గేట్ల ద్వారా 7 లక్షల క్యూసెక్కులకు పైగా వరద జలాలను దిగువకు వదులుతున్నారు. స్పీల్ వే వద్ద 31.3 మీటర్ల వరద ఉద్ధృతి నమోదు అయిందని పోలవరం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 7 లక్షల 57 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో కూడా అంతే ఉందన్నారు. గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద 8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5 లక్షల 91 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ కాల్వలకు 6,350 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. వరద ఉద్ధృతిని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పర్యవేక్షిస్తుంది. సహాయ చర్యల కోసం 2 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక
గోదావరికి వరద నీరు పోటెత్తడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టారు. భద్రాచలం కలెక్టర్ అనుదీప్ జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవలకు కోసం కలెక్టరేట్‌లోనే కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లను విడుదల చేశారు. కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు-08744-241950, వాట్సప్ నంబర్ 9392929743, ఆర్డీఓ కార్యాలయపు కంట్రోల్ రూమ్, వాట్సప్ నంబర్ 9392919750, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ 08743232444, వాట్సప్ నంబర్ 6302485393 ద్వారా అత్యవసర సేవలు పొందాలని కలెక్టర్ సూచించారు. గోదావరిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే 13,61, 708 క్యూసెక్కులపైగా వరద నీరు డిశ్చార్జ్ అవుతోంది. భద్రాచలం వద్ద 54 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తునంది.
లంక గ్రామాలకు ముంపు ముప్పు
తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నానికి ముంపు ముప్పు పొంచిఉంది. గొందూరులో గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. అమ్మవారి విగ్రహం నీట మునిగింది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. లంక గ్రామాలు నీట మునిగాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఏపీ-తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం
తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలంలోని గ్రామాలకి రాకపోకల బంద్ అయ్యాయి. భద్రాచలం నుంచి చర్ల దుమ్ముగూడెం వైపు వెళ్లే దారి పూర్తిగా మూసివేశారు. బూర్గంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి వెళ్లే రోడ్డుపై గోదావరి నీరు చేరడంతో ఆర్టీసీ బస్సులు రాకపోకలు నిలిపి వేశారు. మణుగూరు నుండి భద్రాచలం వచ్చే రహదారి నెల్లిపాక వద్ద రోడ్డుపైన వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు.