Mekapati Goutham Reddy :   50 ఏళ్లకే తనువు చాలించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ( Mekapat Gowtam Reddy ) రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం కూడా భిన్నమైనదే. ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు అంటే ఓ రకమైన ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కంటే భిన్నంగా మేకపాటి వ్యవహరిస్తారు. రాజకీయాలను ఆయన రాజకీయంగానే చూస్తారు. ఎవర్నీ శత్రువులుగా చూడరు. ఇతర పార్టీల వారు కూడా గౌతంరెడ్డిని రాజకీయంగా విమర్శిస్తారు కానీ ఎక్కడా శత్రువుగా చూసిన  సందర్బాలు లేవంటే ఆయన ఎంత సాఫ్ట్‌గా రాజకీయాలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. 


ఏపీలో మంత్రులు ఉంటే దూకుడుగా ఉంటారు.. లేకపోతే సైలెంట్‌గా ఉంటారు. దూకుడుగా ఉండే మంత్రులు రాజకీయంగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటారు. ఇతర మంత్రులు అసలు అధికార సమీక్షలు చేస్తున్నట్లుగా కూడా ఉండరు. కానీ గౌతంరెడ్డి మాత్రం రాజకీయంగా నోటికి పని చెప్పరు కానీ మంత్రిగా మాత్రం తన బాధ్యతల విషయంలో వంద శాతం ఎఫర్ట్ పెడతారు. మంత్రిగా పని తీరు కూడా ఆయన ఇతరుల కంటే భిన్నం. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఆయనపై చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాన్ని ఆయన తన పనితీరుతో ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. తన పరిధిలో వీలైనంత ప్రయత్నం చేసేవారు. ప్రభుత్వ విధానాల ప్రకారం ఆయన ముందుకెళ్లారు. ఎన్ని పెట్టుబడులు సాధించారు.. ఎన్ని ఉద్యోగవకాశాలు తెచ్చారు అన్న లెక్కలు పెడితే ఆయన తన ప్రయత్నాలు అయితే సీరియస్‌గా చేశారని చెప్పుకోవచ్చు. 


పరిశ్రమలు, ఐటీ కంపెనీల కోసం ఆయన తరచూ విదేశీ పర్యటనలు చేస్తూంటారు. తన శాఖపై పూర్తిగా దృష్టి పెట్టి  సమీక్షలు చేసి అతి కొద్ది మంత్రుల్లో గౌతం రెడ్డి ( Goutam Reddy ) ఒకరని సచివాలయంలో చెప్పుకుంటూ ఉంటారు. తన శాఖకు సంబంధించి ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకుంటారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరైనా ఆసక్తి చూపిస్తే వారిని ఏపీకి తీసుకు వచ్చే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటారని చెబుతూంటారు. 


మేకపాటి గౌతంరెడ్డి వ్యక్తిత్వం కూడా భిన్నమైనదే. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన ప్రభుత్వ పరమైన పథకాలు.. ఇతర ప్రయోజనాలను పార్టీలకు అతీతంగా అందరికీ అందేలా చేస్తారు.  తమ.. పర భేదాలు చూడరు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన తీరు చాలా మంది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి రాజకీయాలతో నెగ్గుకు రావడం కష్టమని అనుకుంటూ ఉంటారు. కానీ గౌతం రెడ్డి మాత్రం ఎప్పుడూ తన పంధా వీడి బయటకు రాలేదు. చివరికి అతి స్వల్పకాలమే అయినా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తుదిశ్వాస విడిచారు.