Gannavaram Incident : గన్నవరం ఘటనలో టీడీపీ నేతలకు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పట్టాభిరామ్ సహా 15 మంది టీడీపీ నేతలకు 14 రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. చికిత్స కోసం పట్టాభిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పట్టాభికి చికిత్స అందించాలని టీడీపీ నేతలు కోర్టును కోరారు. గన్నవరం కోర్టులో టీడీపీ నేత పట్టాభిని హాజరుపర్చారు పోలీసులు.  కోర్టులో తన వాదనలు వినిపించిన పట్టాభి.... తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‍లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.  ముగ్గురు వ్యక్తులు ముసుగుతో వచ్చి అరగంటసేపు కొట్టారన్నారు. వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారన్నారు. తోట్లవల్లూరు స్టేషన్‍కు వెళ్లేసరికి అంతా చీకటిగా ఉందని, అక్కడ తనపై దాడి చేశారని ఆరోపించారు. వివిధ స్టేషన్లకు తిప్పుతూ తనను చిత్రహింసలు పెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు ఉన్న కోర్టు పట్టాభికి చికిత్స అందించాలని ఆదేశించింది. 


ముసుగులో వచ్చి అరగంటసేపు కొట్టారు- పట్టాభి


టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, దొంతు చిన్నా, గురుమూర్తి సహా 14 మంది టీడీపీ నేతలకు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. గన్నవరం పోలీస్ స్టేషన్ లో వైద్య పరీక్షల అనంతరం టీడీపీ నేతలను జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఈ సమయంలో పట్టాభిరామ్ పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తోట్లవల్లూరు స్టేషన్‌కు వెళ్లే సరికి అంతా చీకటిగా ఉందని,  ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు తీవ్రంగా కొట్టారని ఆవేదన చెందారు. తనను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్‌ చుట్టి కొట్టారని తెలిపారు. తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని కోర్టులో న్యాయమూర్తికి చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభిరామ్ సహా 14 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. పట్టాభికి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది.  


టీడీపీ నేతలతో ప్రాణహాని - సీఐ ఫిర్యాదు 


 గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 6 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. పట్టాభి సహా 15 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో  పట్టాభి సహా ఇంకొందరు టీడీపీ నేతలతో తనకు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని సీఐ కనకారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించారని ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు. ఈ కేసులోల్ ఏ-1గా పట్టాభిరామ్, ఏ-2గా దొంతు చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.  


టీడీపీ ఆఫీస్ పై దాడి 


గన్నవరం టీడీపీ ఆఫీస్ పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పట్టాభిరామ్ గన్నవరం బయలుదేరారు. మార్గమధ్యలో పట్టాభిని పోలీసులు అరెస్టుచేశారు. ఆ సమయంలోనే వైసీపీ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. పట్టాభి కారును ధ్వంసం చేశారు. అనంతరం ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని పట్టాభి భార్య చందన ఆందోళన దిగారు. ఈ పరిణామాల మధ్య గన్నవరం కోర్టులో పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభిని చిత్రహింసలు పెట్టారని ఆయన సతీమణి చందన ఆరోపించారు.