Warangal News :  యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ పై దాడి కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటనకు సంబంధం వున్న నలుగురు వ్యక్తులను మంగళవారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ అరెస్ట్ కు సంబంధించి హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ వివరాలను వెల్లడిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత రాత్రి హనుమకొండ లో చేపట్టిన యాత్ర ముగిసిన అనంతరం  గుర్తు తెలియని వ్యక్తులు  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన పై ఫిర్యాదుపై కేసు  నమోదు చేసుకున్న హనుమకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడి పాల్పడిన  నిందితులను గుర్తించడం జరిగిందని పోలీసులు ప్రకటించారు.       


వీరిలో నలుగురు నిందితులు  1. చెక్క సుమన్, 2.రావుల కొలను నరేందర్, 3. గుడికందుల వినోద్ కుమార్, సిటిమోర్ సునార్ కృష్ణ లను  హనుమకొండ పోలీసులు   అరెస్ట్  చేశారు.  ఈ దాడి కేసులో సంబంధం వున్న మిగితా నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని హనుమకొండ ఇన్స్ స్పెక్టర్ వెల్లడించారు. తోట పవన్ పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే దాడి చేసింది ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులేనని ... వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకే దాడి చేసినందున ఆయనపైనా కేసులు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.                 


ఉదయమే పోలీస్ కమిషనర్‌ను కలిసిన రేవంత్ రెడ్డి  దీనికి కారణం బీఆర్ఎస్ శ్రేణులే అని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దీని వెనుక ఉన్నారని.. పవన్ హత్యకు కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. ఎర్రబెల్లి, శంకర్ నాయక్ ఇతర ఎమ్మెల్యేలు వార్నింగులతో రెచ్చగొట్టడం వల్లే విపక్ష పార్టీల యాత్రలు, సభలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.   ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఇక దాడి జరిగిన సమయంలో సీసీ ఫుటేజ్‭ లో ఉన్నవారి మొబైల్స్ సీజ్ చేసి విచారించాలని రేవంత్ కోరారు.


అంతకుముందు.. దాడిలో గాయపడ్డ తోట పవన్ ను ఆస్పత్రిలో పరామర్శించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు కాపాడుతున్నారన్నారు. ఇది మంచిది కాదని హెచ్చరించారు. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి అనుబంధ విభాగం కాదని.. ఏ రాజకీయ పార్టీ వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఆదేశాలు ఇస్తున్న వాళ్లు శాశ్వతం కాదన్న ఆయన.. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీని అణిచివేయాలని సూచించారు.