YSR Rythu Bharosa Scheme : ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా నగదు రైతులకు అందించారు. గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 


పరిహారం అందని ఒక్క రైతు లేరు 


రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కరవు పరిస్థితులు లేవని సీఎం జగన్ అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో రూ.782 కోట్లు చెల్లించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీలేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లు అందించిందన్నారు. రైతులకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నామన్నారు. ఏ పంట సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ పరామర్శకు వస్తున్నారని, పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయారన్నారు. గత ప్రభుత్వంపై దత్తపుత్రుడు విపరీతమైన ప్రేమ చూపించాడని విమర్శించారు. అప్పుడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రైతుకు ఉచిత విద్యుత్‌, వ్యవసాయం దండగ అన్న నాయకుడు చంద్రబాబు అని విమర్శలు చేశారు. రైతులపై కాల్పులు జరిపించారన్నారు. రుణాల పేరుతో రైతులను మోసం చేసిన నాయకుడి పాలనను రైతులు ఒకసారి గుర్తుచేసుకోవాలని సీఎం జగన్‌ అన్నారు.


రైతుల ఖాతాల్లో రూ.5500  జమ 


ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఖరీఫ్‌ పనులకు ముందుగానే రైతు భరోసా అందిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం తప్పకుండా రైతు భరోసా అందిస్తున్నామన్నారు. రైతులకు ఏటా రూ.13,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుమన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు రైతులకు అందించామన్నారు. గత మూడేళ్లలో రైతులకు లక్షా 10 వేల కోట్లు ఆర్థికసాయం చేశామన్నారు. ఇవాళ రైతుల ఖాతాల్లో నేరుగా రూ.5,500 నేరుగా జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.