Gade Venkateshwar rao: రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు చాలానే ఉన్నాయంటూ గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు తెలిపారు. అయితే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని తెలిపారు. రాష్ట్రంలో జరిగే అన్ని లావాదేవీల్లో డిజిటల్ కు అవకాశం ఉందని తెలిపారు. కానీ ఒక్క ప్రభుత్వ వైన్ షాపుల్లో మాత్రమే డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేదని అన్నారు. కేవలం నగదు చెల్లింపులు మాత్రమే చేయించుకుంటూ డబ్బులు దోచేయాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పూర్తి నిషేధమన్నారు.. అన్ని చోట్లా అమ్మకాలు జరుపుతున్నారు..
అలాగే మద్యంపై రాష్ట్రంలో ఏమాత్రం నియంత్రణ లేదన్నారు. ప్రతిపక్షంలో జగన్ రెడ్డి చేసిన ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చకుండా ఏం చేస్తున్నారంటూ అడిగారు. పూర్తిగా నిషేధం కాదు పూర్తి అమ్మకాలు చేపడుతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసరారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో చూసిన, ఏ ఊళ్లో చూసినా.. చివరకు ఏ వీదిన చూసినా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటిది మద్యాన్ని ఎలా నిషేదిస్తారని పేర్కొన్నారు. మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు.
వీదికో మద్యం దుకాణం.. వీలైనన్ని సీసాలు
రేపల్లె లో మద్యం తాగి చనిపోయిన వారిని పరామర్శించకుండా తమను అడ్డుకోవడం సరికాదని సూచించారు. మమ్మల్ని అడ్డుకునే పోలీసులు మద్యం మరణాలను ఎందుకు అడ్డుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వీదిలో ఓ మద్యం దుకాణం వెలిసిందిని... అమ్మకాలు అంతు లేకుండా పోయిందని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మందును విచ్చలవిడిగా అమ్ముతున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు. దీని వల్ల తాగే వాళ్లే కాకుండా వారి కుటుంబాలు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆ విషయం ఆలోచించకుండా.. కేవలం డబ్బుల కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అని ప్రశ్నించారు.
రివర్స్ పాలన అంటే తిరిగి ఏం వస్తుందని ఆశించడం..
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వ్యక్తిగతంగా కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కూడా వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేస్తోందన్నారు. స్కూల్స్ కు చాక్ పీస్ లు, డస్టర్ లు కూడా ఇవ్వలేని దుస్దితి లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. రివర్స్ పాలన అంటే తిరిగి మాకు ఎంత వస్తుంది అని ప్రభుత్వం ఆలోచన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు రోడ్లు, మరో వైపు సంక్షేమ పథకాలు అన్ని నాశనం అవుతున్నాయంటూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.