IT Returns 2022: పారిశ్రామిక వేత్తలు తమ ఆస్తి పన్ను చెల్లింపులు జూలై 31, 2022 లోగా ఒకేసారి చెల్లించినట్లయితే వారికి మొత్తం చెల్లింపులో 5 శాతం రాయితీ వెసులుబాటును ఏపీఐఐసీ (APIIC) కల్పించింది. ఈ పిలుపుపై స్వతంత్రంగా స్పందించి సద్వినియోగం చేసుకున్న పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో అత్యధిక పన్ను వసూలు అయింది. తద్వారా కట్టాల్సిన మొత్తం బకాయిలో 5 శాతం తగ్గించుకుని పారిశ్రామిక వేత్తలు కూడా ఎంతగానో లబ్ధి పొందినట్లయింది. ఏపీఐఐసీ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏకంగా రూ.40 కోట్లు ఆస్తి పన్ను చెల్లింపులు జరగడం ఓ రికార్డుగా మారింది. జూన్ 27వ తేదీ నుంచి జూలై31 వ తేదీ వరకు కొనసాగిన ఈ డ్రైవ్ లో స్వయంగా  భాగస్వామ్యమై పారిశ్రామిక వేత్తలు తమ ఆస్తి పన్ను చెల్లింపుల బాధ్యతను పూర్తి చేశారు. 


ఒకే నెలలో 40 కోట్ల ఆస్తి పన్ను చెల్లింపు..!


విశాఖ స్పెషల్ జోన్ అత్యధికంగా రూ.13 కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసి 15 జోన్లలోనే అగ్రస్థానంలో నిలిచింది. రూ.8 కోట్లు వసూలు చేసి తిరుపతి జోన్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.  రూ.7 కోట్లతో విశాఖ రెగ్యులర్ జోన్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. రూ.2 కోట్లకు పైన వసూలు చేసి, కాకినాడ, విజయవాడ, శ్రీకాకుళం జోన్ లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. దీంతో ఒకే నెలలో అత్యధికంగా రూ.40 కోట్ల ఆస్తి పన్నును చరిత్రలో మొదటి సారిగా ఏపీఐఐసీ వసూలు చేసింది. గతంలో  ఏపీఐఐసీ ఆస్తి పన్నుల చెల్లింపు మొత్తం ఏడాదికి సగటున కేవలం రూ. 70 కోట్లు మాత్రమే ఉండేది. కానీ ఈ సారి ఏకంగా జూలై నెల పన్ను వసూళ్ళే రూ.40 కోట్లు కావడం గమనార్హం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఏ పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలగకుండా ఆన్ లైన్ ద్వారానే రూ.35 కోట్ల పైన పన్ను చెల్లింపులు జరగడం మరో చెప్పుకోదగ్గ విషయం. మిగతా రూ.5 కోట్లు బ్యాంకులు, చెక్కులు, నగదు ద్వారా పారిశ్రామికవేత్తలు ఆస్తి పన్ను చెల్లించారు. 


బహుమతుల అందజేత..!


ప్రత్యేక చొరవ తీసుకుని ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్ తో పాటు ఆస్తి పన్ను చెల్లింపుల ప్రక్రియలోనూ ఉత్తమ పనితీరు కనబర్చిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్లకు బహుమతులు అందజేయనున్నారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో బహుమతి ప్రధానోత్సవాలను నిర్వహించబోతున్నట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకంగా ఆస్తి పన్నులను డిజిటల్ గా చెల్లించడంలో జోనల్ మేనేజర్ల కృషిని ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది అభినందించారు. పారిశ్రామిక వేత్తల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని  మరికొంత సమయం  ఈ విధమైన చెల్లింపుల గడువు పొడిగించేందుకు గల అవకాశాలను ఏపీఐఐసీ పరిశీలిస్తున్నట్లు ఎండీ వెల్లడించారు.