AP PM Kisan :  ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి అర్హులైన రైతుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.  కేంద్రం విధించిన నిబంధనలు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులను లబ్దికి దూరం చేస్తున్నాయి. ఇంతకు ముందు స్కీంకు అనర్హులంటూ పెట్టిన షరతులకు తోడు ఈ-కెవైసి వంటి వాటిని అదనంగా జోడించడంతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు అర్హులు కాకుండా పోయింది.  పథకానికి నమోదు చేసుకున్న రైతుల్లో 33 లక్షల మందికి గతంలో అకౌంట్‌లో పడాల్సిన రూ. రెండు వేలు పడలేదు.  అంతకుముందు లబ్ధిదారులతో పోల్చుకుంటే 19 లక్షల మందికి కోత పడింది.ఈ -కెవైసి పూర్తి కాలేదన్న పేరిట డిసెంబర్‌-మార్చి కిస్తును రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో కేంద్రం జమ చేయలేదు. త్వరలో కేంద్ర బడ్జెట్‌ వస్తుండగా గడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సిన మూడవ విడత కూడా జమ కాలేదు. 


రైతులకు ఈ కేవైసీ గండం !


ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద నిధులిస్తున్నారు. ఇప్పుడు  రిజిస్టరైన లబ్ధిదారుల్లో 70 శాతానికే ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగతా ముఫ్పై శాతం  ఈ కేవైసీ పెండింగ్‌లో ఉండిపోయింది. వారికి రూ. రెండు వేలు నగదు జమ కాలేదు.  గత సార్వత్రిక ఎన్నికలకు ముంగిట మోడీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అంటూ పిఎం కిసాన్‌ను ప్రారంభించింది. ఏడాదిలో మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున రైతుల అకౌంట్లలో నేరుగా నగదు బదిలీ చేసే పథకమిది. సంవత్సరంలో మూడు విడతలను ఒక్కోదాన్ని నాలుగు మాసాల కింద వర్గీకరించారు. ఏప్రిల్‌-జులై, ఆగస్టు-నవంబర్‌, డిసెంబర్‌-మార్చి. కాగా కేంద్రం విధిస్తున్న షరతులు లక్షలాది మంది రైతులను స్కీంకు దూరం చేస్తున్నాయి. ఏపీలో ప్రతీ ఏటా లబ్దిదారుల సంఖ్య తగ్గిపోతున్నారు. 


సగానికి సగం మందికి కూడా అందని కేంద్ర పథకం నిధులు 


సొంత భూమి యజమానుల కుటుంబానికి మూడు విడతల్లో కేంద్రం ఏడాదికి ఇచ్చేది రూ.6 వేలు.    ఆ స్వల్ప సాయానికీ కేంద్రం రోజుకో షరతు పెడుతోంది. ఎపిలో 60,77,808 మంది పథకానికి నమోదు చేసుకోగా 2022-23లో  ఏప్రిల్‌-జులై  మాసాలకు 46,62,768 మందికి జమ పడింది.  ఆగస్టు-నవంబర్‌ కు 27,55,285 మందికే ఇప్పటి వరకు జమ పడింది. రిజిస్టరైన వారిలో సుమారు 33 లక్షల మందికి పడలేదు. ముందటి కిస్తు పడ్డ వారిలో 19 లక్షల మందికి కోత పడింది. అంతకు ముందు లబ్ధిదారుల్లో 20 లక్షల మంది తగ్గారు. ఇంత భారీగా ఎందుకు తగ్గుతారన్నదానిపై స్పష్టత లేదు.  ఏపీలో కావాలేన తగ్గిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 


రైతు భరోసా నిధులు కూడా అవే.. రైతులకు ఇబ్బందులు ! 
  


రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వ్యవసాయదారులకు రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్‌తో కలిపి అమలు చేస్తోంది. రెండు పథకాలకూ కలిపి లబ్ధిదారులను రాష్ట్రమే నిర్ణయిస్తోంది. ఏడాదిలో రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.13,500 అందాలి. మేలో ఇచ్చే తొలి కిస్తు రూ.7,500లో రాష్ట్రం 5,500, కేంద్రం 2,000 ఇవ్వాలి. నవంబర్‌లో ఇచ్చే రెండవ కిస్తులో రాష్ట్రం 2 వేలు, కేంద్రం 2 వేలు ఇవ్వాలి. మూడవ కిస్తు 2 వేలనూ కేంద్రమే ఇస్తుంది. అందులో రాష్ట్ర వాటా లేదు.  భూమి యజమానులకు రాష్ట్రం ఇచ్చే సాయం పడుతోంది తప్ప కేంద్రం ఇచ్చేది సకాలంలో పడట్లేదు. లక్షలాది మంది రైతులు కేంద్ర సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అయినా జమ చేస్తుందా అంటే..  అదీ చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు.