Gandahathi Water Falls: శ్రీకాకుళం జిల్లా తూర్పు కనుమల్లో ఎక్కడ చూసినా హరిత శోభ ఉట్టి పడుతుంది. ముఖ్యంగా మహేంద్ర గిరి కొండలను ఆనుకుని ఒడిశా ఆంధ్ర బోర్డలో గల గండహతి జలపాతం పర్యాటకులను కట్టి పడేస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా  కొండ పైనుంచి జారువాలే వాటర్ పాలపొంగును తలపిస్తూ కనువిందు చేస్తుంది. కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంతం మరింత రమణీయంగా మారింది. ఒడిశా గజపతి జిల్లా పర్లాఖి మిండి ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణ ప్రాంతానికి సరిసమానదూరంలో గల ఈ జలపాతం.. భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. 


వీకెండ్ వస్తే చాలు.. ప్రకృతి ప్రేమికులంతా ఇక్కడే!


ఎత్తయిన కనుమల్లోంచి జాలు వారుతోన్న పాల నురగల్లాంటి జల ధారకు తోడు ప్రకృతి కోయ రాగాలు‌ యువత కేరింతలతో మారుమోగుతోంది. గతంలో కేవలం కార్తీక మాసంలో వన భోజనాలకు మాత్రమే పరిమితమైన ఈ గండహతి జలపాతం ఇపుడు ఒడిశా ,ఆంధ్ర పర్యాటకులకు వీక్ ఎండ్ లో సరికొత్త అనుభూతిని పంచుతోంది. మీరు చూస్తున్న ఈ వీడియోనే అందుకు సాక్ష్యం. జలపాతం వద్ద ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కు, చుట్టూ పచ్చటి కొండలు దృశ్యాలను మరింత అందంగా మార్చేసింది. 


గంటలు గడుస్తున్నా.. అక్కడి నుంచి రావాలనిపించదట!


జలపాతం వద్దకు వెళితే అక్కడి నుంచి అసలు కదలాడానికి ఇష్టమే ఉండదని పర్యాటకులు చెబుతున్నారు. పైనుంచి జారువాలే జలపాత హోరు, పాలను తలపించే సౌందర్యం మాటల్లో చెప్పలేని తీయటి అనుభూతి అంటున్నారు. నెటిజన్లు సైతం ఈ వీడియోను చూసి తమకు తెలిసిన వారికి పంపుతుండడంతో ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తున్నారు. తమ సెల్ ఫోన్ లలో అందమైన ఆ దృష్యాలను బంధిస్తున్నారు. మరి మీరు కూడా ఈ ప్రకృతిని ఆస్వాదించి ఎంజాయ్  చేయాలంటే గండహతీ జలపాతం సందర్శించాల్సిందే.


స్వచ్ఛమైన గాలితో పాటు పచ్చటి ప్రకృతి అందాల విందు!


ఇక్కడకు వారానికొకసారి వస్తుంటాం అని ఓ ప్రకృతి ప్రేమికుడు తెలిపాడు. కాస్త ఉపశమనం కావాలన్నా ఇక్కడే వాలిపోతానని వివరించాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇక్కడకు వచ్చి సమయం గడిపితే చాలా సంతోషంగా ఉంటుందన్నాడు. అలాగే భోజనం తీసుకొచ్చుకొని రోజంతా ఇక్కడే గడిపే వాళ్లు కూడా చాలా మంది ఉంటారన్నారు. అలాగే మరో మహిళ కూడా తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వీలు కుదిరినప్పుడల్లా ఇక్కడకు వస్తానని... పిల్లలను పిక్ నిక్ కోసం ఇక్కడకే తీసుకొస్తామని వివరించింది. పచ్చటి ప్రకృతితో పిల్లలకు స్వచ్ఛమైన గాలి అందాలంటే ఇలాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని వివరిస్తోంది.