Land Dispute: కోనసీమ జిల్లాలో ఓ భూవివాదంలో తనను బెదిరిస్తున్నారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఇందులో అమలాపురం పట్టణ సీఐగా పనిచేసిన ఆర్ఎస్ కే బాజిలాల్ తోపాటు అమలాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్ సహా మరో 12 మందిపై పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. కుటుంబ తగాదాల్లో భాగంగా తమ ఇంటిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో పాటు వేధింపులకు, బెదిరింపులకు పాల్పడ్డారని పట్టణంలోని నల్లవంతెన ప్రాంతానికి చెందిన సుంకర లక్ష్మీ మణికుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ముందు పోలీసులకు, ఆపై కోర్టుకు..


తనను, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయింది. వారితో పాటు తమను వేధింపులకు గురిచేసిన పలువురిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలమేరకు పట్టణ సీఐగా పనిచేసిన బాజీలాల్ తో పాటు మరో 13 మందిపై కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని కోనసీమ జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ధృవీకరించారు.


అధికారం చేతిలో ఉందని అజమాయిషీ...


అయితే గొడవలు జరిగినప్పటి నుంచి తమను చాలా బాధ పెడ్తున్నారంటూ లక్ష్మీ మణికుమారి జిల్లా ఎస్పీకి వివరించింది. అధికారం వాళ్ల చేతిలో ఉందని అజమాయిషీ చలాయిస్తూ.. తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పింది. గతంలో పోలీసులు ఏం చేయకపోవడంతోనే కోర్టును ఆశ్రయించానని చెప్పుకొచ్చింది. తమ భూమిని తమకు దక్కకుండా చేసిన ఎస్సై, మున్సిపల్ ఛైర్మన్ తో పాటు మరో 12 మందిని అరెస్ట్ చేసి తమకు సరైన న్యాయం చేయాలని బాధితురాలు సుధీర్ కుమార్ రెడ్డి ముందు వివరించింది. నిందితులు ఎవరైనా సరే కచ్చితంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హమీ ఇచ్చి.. ఆమె ఫిర్యాదు చేసిన వారిపై కేసు నమోదు చేయడంతో ధైర్యంగా వెనుదిరిగింది. 


నూతన ఎస్పీ పనితీరుతో ఒకటే టెన్షన్..


డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పుడు నూతన ఎస్పీగా బాద్యతలు స్వీకరించిన సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి పని తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. పోలీసుల విధుల నిర్వహణలో ఎవ్వరి మాట వినరని ఎస్పీకు పేరుండగా తాజాగా అరెస్ట్ పర్వాలను పరిశీలిస్తే అధికార పార్టీ నాయకులపై కూడా కేసులు నమోదవుతున్నాయి. ఎస్పీ ఇంతకు ముందు పని చేసిన చోట్ల కూడా ఇదే ట్రాక్ రికార్డ్ ఉండడంతో అటు సొంత శాఖలోనే దిగువ స్థాయి అధికారుల నుంచి సిబ్బంది వరకు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 


ఇటీవలే కోనసీమలో పలు పోలీస్ స్టేషన్లలో సుధీర్ఘ కాలంగా ఉన్నటువంటి పలువురు సిబ్బందిని ట్రాన్స్ ఫర్ చేశారు. అదే విధంగా జిల్లాలో సరికొత్త బృందాలను ఏర్పాటు చేశారు. ఏదైనా కేసుల వ్యవహారంలో ఎవరైనా రాజకీయ సిఫారసుల కోసం రాజకీయ నాయకుల వద్దకు వెళుతుంటే కొత్తగా వచ్చిన ఎస్పీగారు ఎవ్వరి మాట వినరట.. మేం చెప్పలేమని తప్పించుకుం టున్నారట పలువురు నాయకులు.