Free electricity for handloom weavers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది నేతన్నలకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఏప్రిల్ 1, 2026 నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయం ద్వారా మగ్గాలకు నెలకు 200 యూనిట్లు , మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత , జౌళి శాఖ మంత్రి సవిత అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,04,488 కుటుంబాలు నేరుగా లబ్ధి పొందనున్నాయి. ఇందులో 93,000 చేనేత మగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి. ఈ రాయితీ వల్ల ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి ఏడాదికి రూ.8,640 , అలాగే పవర్ లూమ్ యూనిట్లకు రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వం ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.150 కోట్లు వెచ్చించనుంది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ భారంతో సతమతమైన నేతన్నలకు ఈ నిర్ణయం ఒక గొప్ప ఊరటగా మారింది. కేవలం విద్యుత్ రాయితీకే పరిమితం కాకుండా, చేనేత రంగాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3,000 నుండి రూ. 4,000లకు పెంచింది. కొత్త యంత్రాల కొనుగోలుపై 90 శాతం రాయితీ అందిస్తోంది. నూలు, రసాయనాలపై 15 శాతం రాయితీ ఇస్తూ, నాణ్యమైన ముడిసరుకును సరఫరా చేస్తోంది. చేనేత కార్మికులను యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పరిధిలోకి తెచ్చి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించింది. నేతన్నలు తయారు చేసిన వస్త్రాలకు సరైన ధర కల్పించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా తనేరా, బిర్లా ఆదిత్య వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా నేరుగా వినియోగదారులకే అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంది. విశాఖపట్నంలో 172 కోట్లతో యూనిటీ మాల్ ఏర్పాటుతో పాటు మంగళగిరి, ఎమ్మిగనూరు, ధర్మవరం వంటి ప్రాంతాల్లో టెక్స్‌టైల్ పార్కులు, మెగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తోంది. ఎన్నికల హామీని ఇంత త్వరగా అమలు చేస్తూ, విద్యుత్ కష్టాల నుంచి విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి సవితకు చేనేత సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఈ పథకం కేవలం రాయితీ మాత్రమే కాదని, చేనేత కళాకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక గొప్ప సామాజిక భద్రతా కవచమని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
