Ganta Meet Chiru :  తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణలు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బోళా శంకర్ సినిమా షూటింగ్ సెట్‌లో ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు, చిరంజీవి మంచి మిత్రులు, అలాగే గంటా  శ్రీనివాసరావు, పొంగూరు నారాయణలు వియ్యంకులు. వీరిద్దరూ కలిసి చిరంజీవి కలవడంతో తమ కుటుంబంలో ఏదో శుభకార్యానికి అహ్వనించేందుకు కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమావేశం పూర్తిగా ప్రైవేటు వ్యవహారం కావడంతో వివరాలు బయటకు చెప్పలేదు.               


మళ్లీ టీడీపీలో యాక్టివ్ అవుతున్న గంటా శ్రీనివాసరావు, నారాయణ                                   


గంటా శ్రీనివాసరావు, పొంగురూ నారాయణలు గత ప్రభుత్వంలో మంత్రులగా పని చేశారు. కానీ టీడీపీ ఓడిపోయిన తర్వాత ఇద్దరూ సైలెంట్ అయ్యారు. పొంగూరు నారాయణపై ప్రభుత్వం పలు రకాల కేసులు పెట్టింది. అయిన న్యాయపోరాటం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి మరోసారి పోటీ చేస్తారన్న  ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు ఇటీవలి కాలంలో టీడీపీలో యాక్టివ్ అయ్యారు. లోకేష్ పాదయాత్ర .. ఇతర అంశాల్లో తరచూ స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్నీ విమర్శిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారిద్దరూ కలిసి చిరంజీవితో భేటీ కావడం సహజంగానే రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 


క్రియాశీల రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్న చిరంజీవి                              


ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత.. చిరంజీవి మెల్లగా రాజకీయాలకు దూరమయ్యారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత తాను ఇక క్రియాశీలక రాజకీయాలకు దూరమని ప్రకటించారు. ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికి ఆయన మాత్రం తాను రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించేనని నిర్మోహమాటంగాప్రకటించారు. రాజకీయ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు.రాజకీయ ప్రకటనలు కూడా చేయడం లేదు. అందుకే.. ఇప్పుడు గంటా  శ్రీనివాసరావు, నారాయణలతో జరిగిన భేటీలోనూ రాజకీయం లేదని చెబుతున్నారు. 


మాజీ మంత్రుల భేటీలో రాజకీయం లేదు !                               


గంటా శ్రీనివాసరావు చాలా తరచుగా చిరంజీవిని కలుస్తూ ఉంటారు. అలా కలిసినప్పుడల్లా రాజకీయ కలయికేనని మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ చిరంజీవి రాజకీయాల ప్రస్తావన తీసుకు రాలేదు. నిజానికి పవన్ కల్యాణ్ కూడా.. చిరంజీవి మద్దతు తమకు ఉంటుందని చెబుతారు కానీ.. నేరుగా తమ పార్టీ ప్రచారానికి వస్తారని ఎప్పుడూ చెప్పలేదు. మధ్యలో వైఎస్ఆర్‌సీపీ కూడా చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని చెప్పుకున్నారు. కానీ అన్నీ తేలిపోయాయి.