Anantapur News: నారా లోకేష్ ఏ యాత్ర చేపట్టినా వైసీపీలో వణుకు కనిపిస్తుందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎన్నికల శంఖారావం పేరుతో లోకేష్ మరో యాత్రకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆమె వెంకటాపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో ఒక ధైర్యం నింపారన్నారు. వైసీపీ ఎన్నో అడ్డంకులు సృష్టించినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. ఇప్పుడు కాస్త విరామం తర్వాత లోకేష్ శంఖారావం పేరుతో పర్యటించి జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేయనున్నారన్నారు.
ఇందులో భాగంగా రానున్న 40-50 రోజుల్లో 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటిస్తారని చెప్పారు. ఒక్కరోజులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం ఉంటుందన్నారు. శంఖారావం ద్వారా బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా 220 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఇప్పుడు శంఖారావంకి కూడా అదే స్థాయిలో స్పందన ఉంటుందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులుగా లేని వర్గం అంటూ రాష్ట్రంలో లేదన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామా అన్న ఉద్దేశ్యంతో ప్రజలు ఉన్నారన్నారు. ప్రస్తుతం ప్రజలంతా టీడీపీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని.. మరీ ముఖ్యంగా లోకేష్ నాయకత్వంపై ఎంతో నమ్మకంగా ఉన్నారన్నారు. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్న వైసీపీ నేతలకు ఇప్పుడు శంఖారావం యాత్ర ప్రటించినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదని పరిటాల సునీత విమర్శించారు.